సర్‌ప్రైజ్ : మూడు వారాల్లోనే డబుల్ ఇస్మార్ట్..!
ఆ నష్టంను కొంతలో కొంత అయినా భర్తీ చేయడం కోసం పూరి జగన్నాథ్ మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు అవకాశం ఇచ్చాడని పుకార్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 5 Sep 2024 4:11 AM GMTడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా నమ్మకం పెట్టుకుని రూపొందించిన డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. రామ్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారు. హైప్ కి తగ్గట్లుగా సినిమా లేక పోవడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో నటించినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది.
థియేట్రికల్ రిలీజ్ లో నిరాశ పరిచిన డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఒక వర్గం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు లేదా అయిదు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. కానీ డబుల్ ఇస్మార్ట్ మాత్రం కేవలం మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఏమాత్రం హడావుడి లేకుండా, ఎక్కడ చిన్న ప్రకటన చేయకుండా డబుల్ ఇస్మార్ట్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో నేటి నుంచి స్ట్రీమింగ్ చేస్తుంది.
పూరి జగన్నాధ్ మార్క్ తో ఈ సినిమా సాగినా కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంలో విఫలం అయింది. ఆగస్టు 15న విడుదల అయిన డబుల్ ఇస్మార్ట్ కి వరుస సెలవులు కలిసి వచ్చాయి. అయినా వసూళ్లు నామమాత్రంగానే నమోదు అయ్యాయి. చిన్న సినిమాలు కమిటీ కుర్రాళ్లు, ఆయ్ సినిమాల పోటీ ముందు డబుల్ ఇస్మార్ట్ నిలవలేక పోయిందనే టాక్ కూడా బాక్సాఫీస్ వర్గాల్లో వినిపించింది. రామ్ వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తున్నాడు. పూరి కూడా ప్రస్తుతం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ ఆయనకు మరింతగా నష్టం మిగిల్చే అవకాశాలు ఉన్నాయి.
మణి శర్మ అందించిన సంగీతం ఈ సినిమా ను నిలబెట్టలేక పోయింది. పూరి జగన్నాధ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ కారణంగా మంచి బిజినెస్ చేసింది. కానీ విడుదల తర్వాత వచ్చిన టాక్ తో నిర్మాత పూరి తో పాటు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా పెద్ద మొత్తంలో నష్టపోయారు అనే టాక్ వినిపిస్తోంది. ఆ నష్టంను కొంతలో కొంత అయినా భర్తీ చేయడం కోసం పూరి జగన్నాథ్ మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు అవకాశం ఇచ్చాడని పుకార్లు వినిపిస్తున్నాయి. థియేటర్ లో మెప్పించలేక పోయిన డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ లో అయినా ఒకింత ప్రభావం చూపిస్తుందేమో చూడాలి.