పూరి.. ఆ జెట్ స్పీడ్ తగ్గించి..
అందుకే హీరోలు డేట్స్ వృధా కాకుండా ఓ పక్క పూరి సినిమాను పార్ట్ టైమ్ లా చేస్తూనే మరో సినిమాను లైన్ లో పెట్టేవారు.
By: Tupaki Desk | 19 July 2024 4:37 AM GMTదర్శకుడు పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా చేసినా కూడా జెట్ స్పీడ్ లోనే ఫినిష్ చేస్తాడు అని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆయనతో సినిమా అంటే ఒకప్పుడు స్టార్స్ నుంచి అప్ కమింగ్ కుర్ర హీరోల వరకు అందరూ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. పూరి ఇప్పటి ట్రెండ్ ను అందుకోవడంలో కాస్త వెనుకబడ్డారు కానీ ఒకప్పుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద మినిమమ్ సక్సెస్ అందుకునేవారు. అందుకే హీరోలు డేట్స్ వృధా కాకుండా ఓ పక్క పూరి సినిమాను పార్ట్ టైమ్ లా చేస్తూనే మరో సినిమాను లైన్ లో పెట్టేవారు.
పూరి జగన్నాథ్ ఒకప్పుడు హీరో క్యారెక్టర్ లతో, డైలాగ్స్ తోనే మినిమమ్ కిక్ ఇచ్చేవారు. మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే నమ్మకం అయితే ఒకటి ఉండేది. ఇక మూడు నెలల్లో షూటింగ్ ఫినిష్ చేయగలిగే సత్తా ఉన్న పూరి జగన్నాథ్ ఇప్పుడు మాత్రం ఏడాది కంటే ఎక్కువ టైమ్ తీసుకుంటూ ఉన్నాడు. ఒక సినిమాకు ఏడాది టైమ్ తీసుకొని పని చేస్తూ ఉండడం.. తనకే నచ్చదు అని పూరి గత ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు.
ఇక లైగర్ కు కరోనా కారణంగా ఏడాది కంటే ఎక్కువ టైమ్ పట్టింది. అది కాస్త అనుకోకుండా జరిగినా ఆలస్యమే. అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ విషయంలో జెట్ స్పీడ్ ప్లాన్ ఉన్నప్పటికీ ఊహించని కారణాలు గ్యాప్ ను పెంచాయి. పూరి వేగంగా సినిమాలు చేసినప్పుడు ఇండస్ట్రీ హిట్లు బాక్సాఫీస్ హిట్లు చూశాడు. రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన రేంజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇక ఈమధ్య మాత్రం కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సొంత ప్రొడక్షన్ లోనే సినిమా నిర్మాణం చేసుకుంటున్న పూరి రెండు వైపులా చూసుకొని అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది. సినిమా లేటయినా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు తప్పవు. మరోవైపు కంటెంట్ లో తేడా రాకూడదు. కాబట్టి పూరి డబుల్ ఇస్మార్ట్ విషయంలో డబుల్ ధీమాక్ తోనే వర్క్ చేస్తున్నాడు. కంటెంట్ కోసమే టైమ్ ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలే ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్. బజ్ పెంచగలిగితే బిజినెస్ బాగుంటుంది. కాబట్టి పూరి తన వేగాన్ని తగ్గించుకొని కష్టపడుతున్నాడు. మరి ఆయన వేగానికి భిన్నంగా రెడీ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.