Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : డబుల్ ఇస్మార్ట్

ఐదేళ్ల కిందట పూరి జగన్నాథ్-రామ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ పెద్ద హిట్ అయింది.

By:  Tupaki Desk   |   15 Aug 2024 9:07 AM GMT
మూవీ రివ్యూ : డబుల్ ఇస్మార్ట్
X

'డబుల్ ఇస్మార్ట్' మూవీ రివ్యూ

నటీనటులు: రామ్ పోతినేని-సంజయ్ దత్-కావ్య థాపర్-బని జే-ఆలీ-గెటప్ శ్రీను-షాయాజీ షిండే- మకరంద్ దేశ్ పాండే-టెంపర్ వంశీ తదితరులు

సంగీతం: మణిశర్మ

ఛాయాగ్రహణం: శ్యామ్ కే నాయుడు-జియాని గియానెలి

నిర్మాతలు: పూరి జగన్నాథ్-ఛార్మి కౌర్

రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్

ఐదేళ్ల కిందట పూరి జగన్నాథ్-రామ్ కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' పెద్ద హిట్ అయింది. దాని తర్వాత 'లైగర్'తో పెద్ద షాక్ తిన్న పూరి.. ఇప్పుడు 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తనకు తాను చాలా తెలివైనవాడిని అని అనుకుని తన పేరు వెనుక 'ఇస్మార్ట్' అని తగిలించుకున్న హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడు శంకర్ (రామ్ పోతినేని) దొంగతనాలు చేస్తూ బతుకుతుంటాడు. తన చిన్నతనంలో తల్లిని కళ్ల ముందే చంపేసిన మాఫియా డాన్ బిగ్ బుల్ (సంజయ్ దత్)ను ఎలాగైనా చంపాలన్న లక్ష్యంతో అతనుంటాడు. ఆ సమయంలోనే తన జీవితంలోకి జన్నత్ (కావ్య థాపర్) వస్తుంది. శంకర్ ఆమె వెనుక తిరుగుతూ సాగిపోతున్న సమయంలో విదేశాల్లో ఉంటున్న బిగ్ బుల్ కు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా తాను మూడు నెలల్లో చచ్చిపోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఒక వైద్యుడి సూచన మేరకు తన మెదడులోని జ్ఞాపకాలన్నింటినీ కాపీ చేసి మరో వ్యక్తిలో పెట్టి తనకు మరణం లేకుండా చేసుకోవాలని అనుకుంటాడు బిగ్ బుల్. అందుకోసం శంకర్ బుర్రనే వాడుకోవాలనుకుంటాడు. మరి ఈ ప్రయత్నం ఎంతమేర ఫలించింది.. మరోవైపు తాను చంపాలనుకున్న వ్యక్తి తాలూకు మెమొరీనే తన బుర్రలోకి రావడంతో శంకర్ ఎలా స్పందించాడు.. తన పగ ఏమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

పూరి జగన్నాథ్ అంటే తెలుగులో హీరోయిజాన్ని రీడిఫైన్ చేసిన చేసిన దర్శకుడు. పూరి జగన్నాథ్ అంటే పేలిపోయే డైలాగులకు కేరాఫ్ అడ్రస్. పూరి జగన్నాథ్ అంటే.. మామూలు కథల్ని కూడా మ్యాజికల్ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించే మెజీషియన్. కానీ ఇదంతా గతం. మాఫియా కథల మత్తులో చిక్కుకోక ముందు వరకు సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేవాడు. కానీ మాఫియా కథలను తిప్పి తిప్పి తీయడం మొదలయ్యాక ఆయన క్రియేటివిటీ అటకెక్కేసింది. సినిమా సినిమాకూ పతనం అవుతూ.. తనను పిచ్చిగా అభిమానించిన ప్రేక్షకులే దండం పెట్టే స్థాయికి చేరుకున్నాడు. పూరి మీద పూర్తిగా ఆశలు కోల్పోతున్న దశలో ఆయన్నుంచి వచ్చిన ఓ మెరుపు.. ఇస్మార్ట్ శంకర్. అదేమీ గొప్ప సినిమా కాకపోయినా.. తన మూస కథల నుంచి కొంచెం బయటికి వచ్చి మెమెరీ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే కాస్త భిన్నమైన కాన్సెప్ట్ ను మాస్ స్టయిల్లో ప్రెజెంట్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగాడు పూరి. అదిరిపోయే సంగీతం.. రామ్ ఎనర్జీ కూడా తోడై 'ఇస్మార్ట్ శంకర్' ఊహించని విజయాన్నందుకుంది. ఐతే దానికి కొనసాగింపుగా వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్'లో మాత్రం ఆ స్థాయి మెరుపులు కనిపించలేదు. ఆల్రెడీ చూసేసిన కాన్సెప్ట్.. సాధారణంగా సాగిపోయే కథనం.. సోసోగా అనిపించే డ్రామా.. యావరేజ్ మ్యూజిక్.. ఇవన్నీ కలగలిసి 'డబుల్ ఇస్మార్ట్'ను ఓ మోస్తరు సినిమాగా మార్చాయి.

'ఇస్మార్ట్ శంకర్'ను ప్రత్యేకంగా మార్చింది అందులో మాస్ ను ఉర్రూతలూగిస్తూ సాగిన పాటలు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. ప్రేక్షకులకు కొత్తదనం పంచిన 'చిప్' కాన్సెప్ట్.. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్. ఐతే 'డబుల్ ఇస్మార్ట్'లో ఈ ఆకర్షణలన్నీ డబులవుతాయని అనుకుంటే.. సగం అయ్యాయి. పాటలు ఏదో అలా నడిచిపోయాయే తప్ప అనుకున్నంత ఊపు తీసుకురాలేకపోయాయి. ఇందులోనూ చిప్ కాన్సెప్ట్ కంటిన్యూ చేశారు కానీ.. పార్ట్-1లో ఉన్నంత ఇంపాక్ట్ లేకపోయింది. రామ్ ఎనర్జీ ఏమీ తగ్గలేదు కానీ.. తన పాత్ర ఆశించిన స్థాయిలో పండలేదు. 'డబుల్ ఇస్మార్ట్'లోనూ మాస్ ను మెప్పించే మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. కథలోనూ కొంత ఆసక్తి లేకపోలేదు. కాకపోతే హై ఇచ్చే మూమెంట్స్ తగ్గిపోయి.. కథలో థ్రిల్ కొరవడి ప్రేక్షకులకు ఆశించిన కిక్కు దొరకదు. హీరో ఎవరినైతే చంపాలని చూస్తున్నాడో.. అదే వ్యక్తి మెమరీ తన మెమరీని రీప్లేస్ చేయడం.. విలన్ కు అనుకూలంగా హీరో పని చేయాల్సిన పరిస్థితి రావడం అన్నది మంచి కాన్ఫిక్ట్ పాయింట్. ఐతే దీని చుట్టూ పూరి డ్రామాను సరిగా పండించలేకపోయాడు. థ్రిల్లింగ్ అండ్ ఎంటర్టైనింగ్ మూమెంట్స్ కు స్కోప్ ఇచ్చే పాయింట్ ఎంచుకుని కూడా దాన్ని అనుకున్నంతగా వర్కవుట్ చేయలేకపోయాడు.

పూరి జగన్నాథ్ సినిమా అనగానే చుట్టూ పెద్ద గ్యాంగునేసుకుని ప్రపంచాన్ని గడగడలాడించే మాఫియా డాన్.. అతడి కోసం వెతికే పోలీసులు.. ఈ సెటప్ చాలా కామన్. ఈ తరహా విలన్ పాత్రతో సంజయ్ దత్ ఎంట్రీ ఇవ్వడంతోనే పూరి మరోసారి అలవాటైన 'మాఫియా' మసాలానే మళ్లీ వడ్డించబోతున్నాడని అర్థమైపోతుంది. సంజయ్ దత్ చేస్తున్నాడు కాబట్టి అతనైనా ఈ పాత్రకు ఏమైనా ప్రత్యేకత చేకూరుస్తాడేమో అని ఆశిస్తాం. కానీ విషయం లేని పాత్రను ఏదో మొక్కుబడిగా చేసుకుపోయాడే తప్ప దాన్ని స్పెషల్ గా మార్చలేకపోయాడు సంజు. విలన్ని అతి భయంకరుడిగా పరిచయం చేసి.. ఆ తర్వాత దాన్ని జోకర్ లాగా మార్చేయడం చాలా తెలుగు సినిమాల్లో కనిపించే లక్షణం. ఇందులోనూ అదే చేశాడు పూరి. సంజు పాత్రను పరిచయం చేసిన తీరుకు.. ఆ తర్వాత అది సాగే వైనానికి పొంతన లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తాడని ఇంట్రో ఇచ్చి.. ఒక మామూలు పాతబస్తీ కుర్రాడు వేసిన ట్రాప్ లో అతను చిక్కుకున్నట్లు చూపించడం కామెడీగా అనిపిస్తుంది. విలన్ పాత్రను ముందే తేల్చేయడంతో 'డబుల్ ఇస్మార్ట్' మీద సగం ఆసక్తి చచ్చిపోతుంది.

ప్రథమార్ధంలో 'డబుల్ ఇస్మార్ట్' ఎగుడు దిగుడుగా సాగుతుంది. రామ్ తన ఎనర్జీతో కొన్ని సీన్లను నిలబెట్టాడు. రొమాంటిక్ ట్రాక్ మాత్రం మరీ రొటీన్ అనిపిస్తుంది. హీరోయిన్ని వెంటాడి వేధించి ప్రేమలో పడేసే ట్రాక్ లను పూరి ఎప్పుడు విడిచిపెడతాడో మరి. 20 ఏళ్ల ముందు 'ఇడియట్'లో చూసిందే ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్'లో కూడా చూస్తాం. హీరోయిన్ పాత్ర చాలా గందరగోళంగా తయారైంది. కానీ కావ్య గ్లామర్ మాత్రం యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రథమార్ధంతో పోలిస్తే రెండో సగంలో 'డబుల్ ఇస్మార్ట్' మెరుగ్గా అనిపిస్తుంది. కథలో కొన్ని మలుపులు.. మాస్ మూమెంట్స్ తో పూరి ఎంగేజ్ చేయగలిగాడు. క్లైమాక్స్ మాస్ ను మెప్పిస్తుంది. ఇక కథతో సంబంధం లేకుండా సాగే ఆలీ కామెడీ ఏమాత్రం వర్కవుట్ కాలేదు. ఈ మధ్య కాలంలో ఇంత జుగుప్సాకరమైన కామెడీ తెలుగు సినిమాలో రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటి పూరి సినిమాల్లో ఆలీ కామెడీ ట్రాక్స్ గుర్తు చేసుకుంటే.. ఇది పేలవంగా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్ అంటే ప్రేక్షకులు ఊహించుకునే స్థాయిలో 'డబుల్ ఇస్మార్ట్' లేదు. కాకపోతే కొన్ని మాస్ మూమెంట్స్ వల్ల ఆ వర్గం ప్రేక్షకులకు పర్వాలేదనిపించవచ్చు.

నటీనటులు:

రామ్ 'ఇస్మార్ట్ శంకర్' తాలూకు ఎనర్జీని ఇందులోనూ కొనసాగించాడు. మాస్ ప్రేక్షకులను అలరించేలా కనిపించాడు. 'ఇస్మార్ట్ శంకర్'లో అతణ్ని మెచ్చిన వాళ్లకు ఇందులోనూ అతను నచ్చుతాడు. పాత్రలో వేరియేషన్లు చూపించాల్సిన చోట అతను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. పాత్రకు అనుగుణంగా సంజయ్ దత్ ను బాగానే ఇమిటేట్ చేశాడు. హీరోయిన్ కావ్య థాపర్ సినిమా అంతటా గ్లామర్ ఒలకబోస్తూనే సాగింది. ఆమెను కథానాయికలా కాకుండా ఒక వ్యాంప్ తరహాలో చూపించాడు పూరి జగన్నాథ్. కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ క్లీవేజ్ షో చేసింది కావ్య. కొంచెం భారీ అవతారం కావడం వల్ల రామ్ పక్కన ఆమె ఆమె సూట్ కాలేదు. సంజయ్ దత్ చూడ్డానికి బాగున్నాడు కానీ.. తన పాత్రలో కానీ.. నటనలో కానీ ఏ విశేషం కనిపించదు. చాలా మొక్కుబడిగా తన పాత్రను చేసినట్లు అనిపిస్తుంది. ఆ స్థాయి నటుడి వల్ల సినిమాకు చేకూరాల్సిన ప్రయోజనం ఏమీ దక్కలేదు. ఆలీ చేసిన అడవి మనిషి పాత్ర జుగుప్సాకరంగా సాగింది. ప్రతి సన్నివేశంలోనూ ఆలీతో అసభ్యకరమైన సంజ్ఞలు చేయిస్తూ దాన్నే కామెడీ అనుకుని నవ్వుకోమన్నాడు పూరి. షాయాజీ షిండే ఓవరాక్షన్ భరించడం చాలా కష్టం. ప్రగతి కూడా అంతే. హీరో తల్లి పాత్రలో ఝాన్సీ మాత్రం కనిపించిన కాసేపు ఆకట్టుకుంది. గెటప్ శీను కూడా ఓకే.

సాంకేతిక వర్గం:

'ఇస్మార్ట్ శంకర్'కు తన సంగీతంతో హీరోగా మారాడు మణిశర్మ. ఆ పాటలు యువతను.. మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. కానీ 'డబుల్ ఇస్మార్ట్'లో మణిశర్మ ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. పాటలు బాలేవు అనలేం కానీ.. 'ఇస్మార్ట్ శంకర్' రేంజిలో మాత్రం లేవు. ఏదో అలా టైంపాస్ చేయించి వెళ్లిపోతాయి. నేపథ్య సంగీతం బాగానే సాగింది. శ్యామ్ కె.నాయుడు-జియాని గియానెలి కలిసి అందించిన ఛాయాగ్రహణం బాగానే సాగింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించిన రైటర్ కమ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తన నుంచి అభిమానులు ఆశించే ఫైర్ చూపించలేకపోయాడు. ఐతే 'లైగర్' తరహాలో ప్రేక్షకుల హింస అయితే పెట్టలేదు. అదే సమయంలో పూర్తిగా ఫామ్ కూడా అందుకోలేదు. కొన్ని మాస్ మూమెంట్స్.. డైలాగ్స్ వరకు పూరి ఓకే అనిపించాడంతే.

చివరగా: డబుల్ ఇస్మార్ట్.. ఇంపాక్ట్ సగమే

రేటింగ్- 2.5/5