డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ : పూరి మార్క్ మాస్ ధమాకా ట్రీట్
ఆ అంచనాల్ని రెట్టింపు చేస్తూ ఈ రోజు సాయంత్రం విడుదల చేసిన `డబుల్ ఇస్మార్ట్` ట్రైలర్ ఎగ్జయిట్ చేస్తోంది.
By: Tupaki Desk | 4 Aug 2024 2:33 PM GMTఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో బ్లాక్ బస్టర్ హిట్ `ఇస్మార్ట్ శంకర్`కి సీక్వెల్ గా `డబుల్ ఇస్మార్ట్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 15 ఆగస్ట్ 2024న ఇది థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ కిక్కు పెంచాయి. పూరి మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని ఒక అంచనా ఉంది.
ఆ అంచనాల్ని రెట్టింపు చేస్తూ ఈ రోజు సాయంత్రం విడుదల చేసిన `డబుల్ ఇస్మార్ట్` ట్రైలర్ ఎగ్జయిట్ చేస్తోంది. ట్రైలర్ ఆద్యంతం పూరి మార్క్ ట్రీట్‌మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే రామ్ మొదటి భాగం కంటే రెట్టించిన ఎనర్జీతో నటించాడని ట్రైలర్ చెబుతోంది. పార్ట్ 1లో చూపించినట్టే మెమరీ చిప్ ని రామ్ మెదడులోకి ఇన్ సర్ట్ చేసి పూరి మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. మెమరీ చిప్‌లోనే అసలు మ్యాజిక్ దాగి ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ సినిమాకి అతి పెద్ద ఆకర్షణ అనడంలో సందేహం లేదు. కేజీఎఫ్ అధీరాగా ఆకట్టుకున్న సంజూ `ఇస్మార్ట్ శంకర్`లో క్రూరమైన విలన్‌గానే కాదు కామిక్ టైమింగ్ తోను మెప్పిస్తాడని అర్థమవుతోంది. విలన్ బలవంతంగా మెమరీ చిప్ ని ఇస్మార్ట్ శంకర్ మెదడులోకి పంపించే ప్రయత్నంలో ఉండగా ఏం జరిగిందన్నది ట్రైలర్ లో ఆసక్తిగా చూపించారు. మార్ ముంత చోడ్ ముంత అంటూ మాస్ ఎనర్జిటిక్ స్టెప్పుటతో రామ్ అదరగొడుతున్నాడు. ఇక ఇందులో పూరి సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే తల్లి కొడుకు సెంటిమెంట్.. స్ఫూర్తి నింపుతుంటే... షాయాజీ షిండే ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ట్రైలర్ ఆద్యంతం పూరి మార్క్ డైలాగులు ఎంటర్ టైనింగ్ గా వర్కవుట్ అయ్యాయి. ఇక కథానాయికను ఎప్పటిలానే బోల్డ్ అవతార్ లో ప్రెజెంట్ చేసారు పూరి. ఎనర్జిటిక్ హీరోకి తగ్గట్టుగానే నభానటేష్ ని రీప్లేస్ చేసేలా ఇస్మార్ట్ బ్యూటీతో మ్యాజిక్ చేస్తున్నారు. ట్రైలర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ట్రైలర్ లో ఉన్న ఎనర్జీ ఎంటర్ టైన్ మెంట్ థియేటర్లలో వర్కవుటైతే పూరీకి మళ్లీ కంబ్యాక్ హిట్ దక్కినట్టే. ఆగస్టు 15 వరకూ వేచి చూడాలి.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేని లవర్ పాత్రలో కావ్య థాపర్ నటించింది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించారు. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. ట్రైలర్ లో నేపథ్య సంగీతం ఇంప్రెస్ చేసింది.