కొడుకు కోసం సింపుల్ ద్రావిడ్!
ఈ సమయంలో తన భార్యతో కలిసి క్రికెట్ స్టేడియంలో సింపుల్ గా కనిపించాడు ద్రావిడ్!
By: Tupaki Desk | 2 Dec 2023 10:30 AM GMTరాహుల్ ద్రావిడ్... టీం ఇండియా క్రికెటర్ గా, వరల్డ్ క్రికెట్ లో ది వాల్ గా ఎన్నో సాధించిన సంగతి తెలిసిందే. క్రికెట్ మాత్రమే తన వృత్తి, ప్రవృత్తి అన్నట్లుగా ఉండే ఈ మిస్టర్ డిపెండబుల్.. రెండోసారి టీమిండియా ప్రధాన కోచ్ గా ఎంపికయ్యారు. ద్రావిడ్ కోచింగ్ లో టీం ఇండియా సమిష్టిగా రాణిస్తుందని.. లక్కీ టిప్ విజయాలు కాకుండా, ఒరిజినల్ విక్టరీలు సాధిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తన భార్యతో కలిసి క్రికెట్ స్టేడియంలో సింపుల్ గా కనిపించాడు ద్రావిడ్!
అవును... రెండోసారి టీమిండియా ప్రధాన కోచ్ గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. భారత యువ జట్టు ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్ లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే 3 - 1 తో ముందడుగు వేసి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని కైవసం చేసుకుంది.
ఈ గ్యాప్ లో ప్రస్తుతం హాలిడే మూడ్ లో ఉన్న మిస్టర్ డిపెండబుల్... తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఇదే సమయంలో తన కొడుకు ఆట చూసేందుకు భార్యతో కలిసి మైసూర్ వెళ్లాడు. ఈ సందర్భంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలకు తావులేకుండా స్టేడియంలో సింపుల్ గా కనిపించిన ద్రావిడ్ దంపతుల పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
మైసూర్ లోని శ్రీకంఠదుట్ట నరసింహరాజ వడయార్ స్టేడియంలో శుక్రవారం కర్ణాటక – ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన "కూచ్ బెహార్ ట్రోఫీ" మ్యాచ్ ని వీక్షించేందుకు టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భార్య విజయతో కలిసి మైదానానికి చేరుకున్నారు. తమ కుమారుడు సమిత్ కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వేళ అతని ఆటను ఆసక్తిగా వీక్షించారు.
కాగా... 2018లో జరిగిన అండర్-14 టోర్నీలో సమిత్ ద్రావిడ్ 150 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో.. ఆ తర్వాత 2023లో జరిగిన ప్రతిష్టాత్మక "వినూ మన్కడ్ ట్రోఫీ"కి కూడా ఈ జూనియర్ ద్రావిడ్ ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయిన సమిత్.. ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లలో కేవలం ఒక అర్ధ సెంచరీతో సహా 122 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
అయితే ముంబైపై జరిగిన మ్యాచ్ లో 95 బంతుల్లో 87 పరుగులు చేసిన చాలా ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో పది బౌండరీలు కొట్టడమే కాకుండా.. పది ఓవర్లు బౌలింగ్ చేసి 59 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.