డ్రీమ్ గర్ల్ 2 .. టాక్ ఓడింది.. హీరో విల్ పవర్ గెలిచింది!
అబ్బాయి అమ్మాయిగా మారితే.. కొంటె కుర్రాళ్లకు అంకుల్స్‌కి వలపు బాణాలు విసిరితే.. ఆపై ఆ వింత మాయాజాలం ఎంతగా పని చేస్తుందో అర్థం చేసుకునేందుకు ఈ సినిమా కలెక్షన్లను పరిశీలించి చూడాలి.
By: Tupaki Desk | 3 Sep 2023 5:18 AM GMTఅబ్బాయి అమ్మాయిగా మారితే.. కొంటె కుర్రాళ్లకు అంకుల్స్‌కి వలపు బాణాలు విసిరితే.. ఆపై ఆ వింత మాయాజాలం ఎంతగా పని చేస్తుందో అర్థం చేసుకునేందుకు ఈ సినిమా కలెక్షన్లను పరిశీలించి చూడాలి. నిజానికి 2019 బ్లాక్ బస్టర్ మూవీ డ్రీమ్ గర్ల్ కి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సీక్వెల్ డ్రీమ్ గర్ల్ 2 రిలీజయ్యాక విమర్శకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, సగటు ప్రజలు కూడా యూట్యూబ్ లో చెత్త సినిమా అంటూ విమర్శించారు.
కానీ డ్రీమ్ గర్ల్ 2 బాక్సాఫీస్ ఫలితం మాత్రం ప్రారంభ సమీక్షలకు విరుద్ధంగా ఉంది. డ్రీమ్ గర్ల్ 2 పేలవమైన సమీక్షలతో నిరాశపరిచినా కానీ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. 100 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా వెళుతోంది. ఒక వ్యక్తి అనివార్య పరిస్థితుల్లో స్త్రీలా దుస్తులు ధరించడం ఆ తర్వాత పురుష ప్రపచంతో అతడి పోరాటం నేపథ్యంలో ఆద్యంతం కామెడీ టచ్ తో రూపొందించిన ఈ సినిమాకి యూత్ బ్రహ్మరథం పడుతోంది. నిజానికి ఈ కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. ఇంతకు ముందు హిందీ- తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చాయి. నిజానికి డ్రీమ్ గర్ల్ 2లో క్లీన్ కామెడీ లేదు. మంచి స్క్రిప్ట్ కూడా లేదు కానీ ఆయుష్మాన్ నటన, విజువల్ బ్రిలియన్సీ వర్కవుటవ్వడంతో ఈమాత్రం ఆదరణ దక్కిందని చెబుతున్నారు.
2022 తీవ్రంగా నిరాశపరిచినా కానీ 2023 బాలీవుడ్ కి బాగా కలిసొస్తోందని చెప్పాలి. ఒకదాని వెంట ఒకటిగా విజయాలు దక్కడం ఎంతో పెద్ద ఊరట. పఠాన్ తర్వాత గదర్ 2 ఘనవిజయం సాధించింది. షారూఖ్ ఖాన్- సన్నీడియోల్ లాంటి అగ్ర హీరోలు బిగ్ బ్యాంగ్ తో ఘనమైన కంబ్యాక్ ని చూపించారు. ఖిలాడీ అక్షయ్ నటంచిన ఓ మై గాడ్ 2 కూడా స్లీపర్ హిట్ గా నిలిచింది. కొన్ని వరుస పరాజయాల తర్వాత అక్షయ్ కి ఇది గొప్ప ఊరట. ఇప్పుడు ఆయుష్మాన్- డ్రీమ్ గర్ల్ 2 కూడా చక్కని వసూళ్లను సాధించింది. సత్య ప్రేమ్ కి కథ, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, తూ ఝూతీ మైన్ మక్కార్, జరా హత్కే జరా బచ్కే యావరేజ్ సినిమాలే అయినా నిర్మాతలకు నష్టాలు తేలేదు. డ్రీమ్ గర్ల్ 2 చక్కని లాభాలనే తెస్తోంది. ఇది నిజంగా బాలీవుడ్ కి గొప్ప ఊరట. కరోనా తర్వాత నెమ్మదిగా పరిశ్రమ కోలుకుంటోంది. అయితే దీనిని మరో లెవల్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత జవాన్- సలార్ చిత్రాలకు ఉందనడంలో సందేహం లేదు.