వచ్చే వారాన్ని కబ్జా చేసేసిన డబ్బింగ్ సినిమాలు
టాలీవుడ్ లోకి ఎన్నో డబ్బింగ్ సినిమాలు రిలీజవుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే మంచి సినిమాలుగా పేరు తెచ్చుకుంటున్నాయి.
By: Tupaki Desk | 28 Feb 2025 10:40 AM ISTటాలీవుడ్ లోకి ఎన్నో డబ్బింగ్ సినిమాలు రిలీజవుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే మంచి సినిమాలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. తమిళ స్టార్ హీరో అజిత్ నుంచి వచ్చిన పట్టుదల సినిమా ఆడియన్స్ ను అలరించడంలో ఫెయిల్ అయినప్పటికీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, మార్కో సినిమాలు మాత్రం హిట్లుగా నిలిచాయి.
దానికంటే ముందు అమరన్ భారీ బ్లాక్ బస్టర్ కాగా, ఎన్నో అంచనాలతో వచ్చిన కంగువ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ వారం ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్ధం సినిమా రిలీజవుతుండగా, దానికి పోటీగా అఘాతియా అనే డబ్బింగ్ సినిమా కూడా రిలీజవుతుంది. ఈ తర్వాతి వారాన్ని పూర్తిగా డబ్బింగ్ సినిమాలే ఆక్యుపై చేశాయి.
వచ్చే వారం అంటే మార్చి 7న తెలుగులో మూడు వేరు వేరు భాషల నుంచి మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి బాలీవుడ్ లో భారీ బ్లాక్ బస్టర్ గా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఛావా మూవీ. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
ఛావాను నార్త్ ఆడియన్స్ ఆదరించినట్టు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి. ఆడియన్స్ కనెక్ట్ అయితే టాలీవుడ్ లో కూడా ఛావా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. ఇక తమిళ భాష నుంచి జీవీప్రకాష్ కుమార్ నటించిన ఫాంటసీ హారర్ర్ మూవీ కింగ్‌స్టన్ రిలీజ్ కానుంది. కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జీవీ ప్రకాష్ సరసన దివ్య భారతి హీరోయిన్ గా నటించింది.
వీటితో పాటూ మల్లూవుడ్ లో మంచి కలెక్షన్లు అందుకుంటున్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ కూడా మార్చి 7నే ప్రేక్షకుల ముందుకు రానుంది. కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు జిత్తు అష్రఫ్ దర్శకత్వం వహించాడు. మూడు డిఫరెంట్ జానర్లలో మూడు వేర్వేరు భాషల నుంచి వచ్చిన సినిమాల్లో ఏ సినిమా తెలుగులో సక్సెస్ అవుతుందో చూడాలి.