Begin typing your search above and press return to search.

మాదీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబ‌మే!

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో దుల్క‌ర్ త‌న తండ్రి-త‌ల్లి కుటుంబ నేప‌థ్యం గురించి పంచుకున్నాడు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే..

By:  Tupaki Desk   |   5 Nov 2024 8:30 AM GMT
మాదీ  మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబ‌మే!
X

చిరంజీవి సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చి మెగాస్టార్ గా ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. చిరంజీవి స‌క్సెస్ అయిన త‌ర్వాత అదే రంగంలోకి త‌మ్ముళ్లు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద హీరో అయితే ..నాగ‌బాబు మాత్రం నిర్మాత‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. వాళ్లు ఈ స్థాయిలో ఉన్నారంటే కార‌ణం చిరంజీవి అన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇదే త‌ర‌హాలో మ‌ల‌యాళం స్టార్ హీరో మ‌మ్ముట్టి కుమారుడు దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా ఎంట్రీ ఇచ్చి అక్క‌డ పెద్ద స్టార్ అయ్యాడు.

అటుపై టాలీవుడ్ లోనూ మార్కెట్ క్రియేట్ చేసుకుని ఇక్క‌డా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించు కున్నాడు. 'సీతారామం'..ఇటీవ‌ల రిలీజ్ అయిన 'ల‌క్కీ భాస్క‌ర్' తో దుల్క‌ర్ మ‌రింత ఫేమ‌స్ అయ్యాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో దుల్క‌ర్ త‌న తండ్రి-త‌ల్లి కుటుంబ నేప‌థ్యం గురించి పంచుకున్నాడు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే..

' మాది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబ‌మే. నాన్న‌కు ఐదురుగు తోబుట్టువులు. అందులో మా నాన్న ఒక్క‌రే స్టార్. మిగ‌తా వారంతా మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వారే. మా అమ్మ తోబుట్టువులు ముగ్గురు. వాళ్లంద‌రిదీ కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి జీవిత‌మే. ఆ అవ‌గాహ‌న‌, అనుభ‌వంతోనే ల‌క్కీ భాస్క‌ర్ క‌థ‌కు సెట్ అయ్యాను. భాస్క‌ర్ ల‌క్కీ ఎలాగో? నేను నా జీవితంలో అదృష్టం కోసం చిన్న‌ప్పుడు ప‌గ‌టి క‌ల‌లు క‌నేవాడిని. లాట‌రీ టికెట్ కొనాలి. అది నాకే త‌గ‌లాలి అని కోరుకునేవాడిని.

ఇదే నేప‌థ్యంలో ఈ మ‌ధ్య ఓ ఆస‌క్తిక‌ర క‌థ కూడా విన్నాను. ఇలాంటి పాత్ర‌లు చేయాలి? ఇలాంటి క‌థ‌లు చేయాల‌నే ప్ర‌త్యేక‌మైన కోరిక‌లు అంటూ ఏమీ లేవు. అలాంటి క‌ల‌లు, కోరిక‌లు ఉంటే మ‌న‌ల్ని మ‌నం పరిమితం చేసుకున్న వాళ్లం అవుతాం. అందుకే నా విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు లేకుండానే ప‌నిచేస్తాను. మ‌నం ఎలా ఉండే వాళ్లం? ఎలా ఎదిగాం? ఎలా బ్ర‌తుకుతున్నాం? అన్న‌ది ఎప్పుడూ మ‌ర్చిపోకూడ‌దు. వ‌చ్చిన మూలాలు అసలే మ‌రువకూడ‌దు' అన్ని అన్నారు.