Begin typing your search above and press return to search.

దుల్కర్-పూజా.. మళ్ళీ తెలుగు దర్శకుడే..

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈమధ్య తెలుగు కనెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 7:32 AM GMT
దుల్కర్-పూజా.. మళ్ళీ తెలుగు దర్శకుడే..
X

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈమధ్య తెలుగు కనెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఆఫర్స్ గట్టిగానే వస్తున్నా చాలా కథల ఎంపిక విషయంలో సెలెక్టివ్ గా ముందుకు సాగుతున్నాడు. అతను ఎలాంటి సినిమా ఓకే చేసినా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుందని చెప్పవచ్చు. సీతారామం సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న దుల్కర్ లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ తో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

ఇక ఆ విజయాన్ని ఆస్వాదించుకుంటూ, మరొక ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఆయన అందాల నటి పూజా హెగ్డేతో కలిసి తెరపై సందడి చేయనున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. దసరా వంటి హిట్ సినిమాలను నిర్మించిన ఈ స్టూడియో ప్రస్తుతం ది ప్యారడైస్ సినిమా నిర్మాణంలో ఉంది.

ఈ కొత్త ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరనే విషయంలో అనేక రకాల గాసిప్స్ వినిపించాయి. అయితే ఈసారి కూడా దుల్కర్ మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అందులోనూ కొత్త దర్శకుడు కావడంతో అతను కంటెంట్ పై ఎంత నమ్మకం ఉంచాడో అర్థం చేసుకోవచ్చు. ఆ డెబ్యూ డైరెక్టర్ పేరు రవి. గతంలో మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న రవి, ఈ సినిమాలో తన దర్శకత్వ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించబోతున్నాడు.

దుల్కర్ పూజా హెగ్డే జంట తొలిసారి తెరపై కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన ఆకర్షణ ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 11న మొదలుకానుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. డిసెంబర్ మొదటి వారం స్క్రీన్ టెస్టింగ్ జరిపిన తర్వాత రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. క్యూట్ ప్రేమకథతో పాటు వినూత్న కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉందని మేకర్స్ చెబుతున్నారు.

దుల్కర్ సల్మాన్ సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతూ, అన్ని భాషల్లో తనను నిరూపించుకుంటూ ఉన్నారు. ఇక పూజా హెగ్డే, తన కెరీర్‌లో వివిధ పాత్రలతో విజయాలను అందుకుంటూ, ఈ సినిమాలో దుల్కర్‌తో జతకట్టడం ద్వారా మరొక కొత్త జోడి క్రియేట్ చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి. దుల్కర్ పూజా జంట కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.