Begin typing your search above and press return to search.

తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్న టాలెంటెడ్ హీరో!

దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర‌మైన స్థానాన్ని సంపాదించుకున్న మలయాళ హీరో.

By:  Tupaki Desk   |   16 Oct 2024 4:30 PM GMT
తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్న టాలెంటెడ్ హీరో!
X

దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర‌మైన స్థానాన్ని సంపాదించుకున్న మలయాళ హీరో. వైవిధ్య‌మైన పాత్ర‌లు, విలక్షణమైన సినిమాల‌తో త‌న‌దైన ముద్రవేశారు. ముందుగా డబ్బింగ్ చిత్రాలతో జనాల దృష్టిని ఆకర్షించిన ఈ వర్సటైల్ యాక్టర్.. స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీగా తన సినిమాలను రిలీజ్ చేసే రేంజ్ కు చేరుకున్నారు. అసలు దుల్కర్ ఒక పరభాషా నటుడు అనే విషయాన్నే తెలుగు ఆడియన్స్ మర్చిపోయారంటే, అతన్ని ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి తెలుగులోనే కాదు, దుల్కర్ సల్మాన్ ఏ భాషలో నటిస్తే, ఆ భాషలో ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోతుంటారు. ఈ విధంగానే వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విషయంలో అతను చాలా లక్కీ అనుకోవాలి. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో దుల్కర్ ఒకరు. భాషతో సంబంధం లేకుండా ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు, మలయాళ, తమిళంతో పాటుగా హిందీలోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అందుకే డీక్యూ రియల్ పాన్ ఇండియా స్టార్ అని చెప్పాలి.

'ఓకే బంగారం' అనే డబ్బింగ్ మూవీతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత 'మహానటి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. 'కనులు కనులను దోచాయంటే' చిత్రాన్ని అనువాదం చేసి మరో హిట్టు కొట్టాడు. ఇదే క్రమంలో వచ్చిన 'సీతారామం' మూవీతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకొని, టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. 'క‌ల్కి 2898 ఏడీ'లో అతిథి పాత్ర‌లో అలరించిన దుల్కర్.. ఇప్పుడు 'లక్కీ భాస్కర్' గా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.

'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం 'లక్కీ భాస్కర్'. 1980-90స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి కానుకగా పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అక్టోబర్ 31వ తేదీన తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ ఈ మూవీపై బజ్ క్రియేట్ చేసింది. ఇది ఏ రేంజ్‌ హిట్‌ అవుతుందో చూడాలి.

ఇకపోతే దుల్కర్ సల్మాన్ తెలుగులో మరికొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు. రానా దగ్గుబాటితో కలిసి ‘కాంత’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందిస్తున్నారు. అలానే ప‌వ‌న్ సాధినేని డైరెక్షన్ లో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాని ప్రకటించారు. గీతా ఆర్ట్స్‌, స్వ‌ప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సందీప్ గుణ్ణం, ర‌మ్య గుణ్ణం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రాబోతున్నాయి.