సొంత పరిశ్రమని లైట్ తీసుకున్నాడా?
ట్రెండ్ ని ఫాలో అవుతూ సినిమాలు చేస్తున్నాడు.
By: Tupaki Desk | 16 March 2024 6:30 AM GMTమమ్ముట్టి వారసుడిగా మాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన దుల్కర్ సల్మాన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తండ్రి వారసత్వాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. తండ్రి ని మించిన తనయుడు అవుతాడనే అంచనాలున్నాయి. నటన..అందం ..అభినయం ఉన్న నటుడు. ఇప్పటికే మాలీవుడ్ లో సక్సెస్ అయ్యాడు. టాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసాడు. ట్రెండ్ ని ఫాలో అవుతూ సినిమాలు చేస్తున్నాడు.
వైవిథ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని గుర్తింపును దక్కించుకున్నాడు. మరి ఇప్పుడీ నయా స్టార్ సొంత పరిశ్రమని దూరం పెడుతున్నాడా? అతడి ప్లానింగ్ ఇప్పుడు కొత్త పంథాలో కనిపిస్తుందా? అంటే అవుననే లీకులందుతున్నాయి. గత ఏడాది దుల్కర్ సొంత పరిశ్రమలో కేవలం ఒక్క సినిమా నే చేసాడు. అదే 'కింగ్ ఆఫ్ కొత్త'. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకో వడం విఫలమైంది అనుకోండి.
అంతకు ముందు వరకూ తండ్రి తరహాలోనే వేగంగా సినిమాలు చేసాడు. ఏడాదికి కనీసం మూడు సినిమా లైనా ప్రేక్షకుల ముందుకొచ్చేలా ప్లాన్ చేసుకునే వారు. కానీ గత ఏడాది ఆ ప్లానింగ్ కనిపించలేదు. సరైన స్టోరీలు కుదరక చేయలేదా? లేక ఇతర భాషలపై దృష్టి పెట్టే క్రమంలో లైట్ తీసుకున్నాడా? అన్న సందేహం రావడం సహజం. ఓ సారి ఆ సంగతి చూస్తే 2022 లో ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
అవన్నీ వేరు వేరు భాషలకు చెందిన చిత్రాలే. 'హే సెనిమాకా' తమిళ సినిమా కాగా..'సెల్యూట్' మలయా ళ చిత్రం.. అదే ఏడాది తెలుగు డెబ్యూ 'సీతారామం' రిలీజ్ అయింది. అలాగే 'రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్' అనే హిందీ సినిమా కూడా చేసాడు. ఇలా ఒకే ఏడాది ఏకంగా నాలుగు భాషల్లో సినిమాలు చేయడం అన్నది అదే తొలిసారి. మొత్తంగా చివరి మూడు సంవత్సరాల్లో సొంత భాషలో కేవలం రెండు సినిమాలే చేసాడు. ప్రస్తుతం తెలుగులో 'లక్కీ భాస్కర్' సినిమాలో నటిస్తున్నాడు. ఇంకే భాషలో కూడా కమిట్ అవ్వలేదు. దీంతో దుల్కర్ తెలుగు సినిమాలే టార్గెట్ గా పనిచేస్తున్నాడా? అన్న సందేహం రాక మానదు.