ఏడాదికి ఒక్క సినిమా అయితే ఎలా అబ్బాయ్?
కొన్నాళ్ల పాటు దుల్కార్ సల్మాన్ కూడా ఇలేగా ప్రేక్షకుల ముందుకొచ్చా డు
By: Tupaki Desk | 28 July 2023 1:30 AM GMTమాలీవుడ్ సూపర్ స్టార్లు మమ్ముట్టి..మోహన్ లాల్ ఏడాదికి కనీసం ఐదు నుంచి 8 సినిమాలైనా చేస్తుంటారు. వాటిని ఒకే ఏడాదిలో పూర్తిచేసి రిలీజ్ చేస్తుంటారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇలా ఓ స్టార్ హీరో సినిమాలు చేసి అదే ఏడాది రిలీజ్ చేయడం అన్నది కేవలం మాలీవుడ్ వాళ్లకే చెల్లింది. తక్కువ బడ్జెట్ లో..కంటెంట్ ఉన్న సినిమాని అందించడం వాళ్లకే చేతనైందన్నది వాస్తవం. ఆ తరహా ప్రయత్నాలు ఇంకే పరిశ్రమలోనూ జరగవు. ఆ తర్వాత తరం నటులు కూడా చాలా మంది కనీసం మూడు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు.
కొన్నాళ్ల పాటు దుల్కార్ సల్మాన్ కూడా ఇలేగా ప్రేక్షకుల ముందుకొచ్చా డు. అయితే ఇప్పుడా యంగ్ హీరో పంథా మారింది. వివిధ భాషల్లో అవకాశాలు రావడంతో పూర్తి స్థాయిలో సొంత పరిశ్రమకి డేట్లు ఎక్కువగా కేటాయించలే కపోతున్నాడు. ఈ నేపథ్యంలో దుల్కార్ తన జర్నీ విషయంలో కుటుంబ సభ్యులు ఎలా ఫీలవుతున్నారో? రివీల్ చేసాడు. దుల్కార్ తండ్రి ఏడాదికి కనీసం ఐదు సినిమాలైనా చేయాలని చెబుతారు.
ఇలా ఒక సినిమా చేస్తే ఎలా అబ్బాయ్? ఇంటికి రావొద్దని సరదాగా అంటుంటారుట. అప్పుడప్పుడు ఈ విషయంలో కాస్త సీరియస్ గానూ ఉంటారుట. ఇక దుల్కార్ సతీమణి అమలా సూఫియా కూడా భర్త ఇలా చేయడంపై అసలు నువ్వు నటుడివేనా? అని అంటుందిట. నటుడిగా తనని ఇప్పటికీ సూఫియా ఒప్పుకోరుట. ఆమె దృష్టిలో దుల్కార్ కేవలం ఉదయాన్నే పనికి వెళ్లి ఇంటికి వచ్చే సాధారణ వ్యక్తిని మాత్రమే. తాను హీరో అని ఎన్నిసార్లు వారించి చెప్పినా అంగీకరించరుట.
పెళ్లైన రెండేళ్లకే ఎవరైనా నిర్మాత ఇంటికొచ్చి మీతో సినిమా తీయాలని చెబితే..అమల మీతో వాళ్లకు సినిమా చేయాలని ఎందుకు అనిపిస్తుందని ఆటపట్టిస్తుందిట. ఇలా అన్న ప్రతీసారి తాను నటుడిని అని ఇంట్లో వాళ్లకే గుర్తు చేయాల్సి వస్తుందని దుల్కార్ అన్నాడు. దుల్కార్ సల్మాన్ 'సీతారామం' సినిమాతో తెలుగులో తొలి సినిమా చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు 'ఒకే బంగారం' లాంటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.