'డంకి' మూవీ రివ్యూ
By: Tupaki Desk | 21 Dec 2023 7:21 AM GMT'డంకి' మూవీ రివ్యూ
నటీనటులు: షారుఖ్ ఖాన్- తాప్సి పన్ను- బొమన్ ఇరానీ- విక్కీ కౌశల్- విక్రమ్ కోచర్- అనిల్ గ్రోవర్ తదితరులు
సంగీతం: ప్రీతమ్
నేపథ్య సంగీతం: అమన్ పంత్
ఛాయాగ్రహణం: మురళీధరన్- మనుష్ నందన్- అమిత్ రాయ్- కుమార్ పంకజ్
రచన: రాజ్ కుమార్ హిరానీ- కనిక థిల్లాన్- అభిజత్ జోషి
నిర్మాతలు: రాజ్ కుమార్ హిరానీ- గౌరీ ఖాన్- జ్యోతి దేశ్ పాండే
దర్శకత్వం: రాజ్ కుమార్ హిరానీ
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు షారుఖ్ ఖాన్. అలాంటి హీరోకు ఇప్పటిదాకా అపజయమే ఎరుగని గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తోడయ్యాడు. వీరి కలయికలో తెరకెక్కిన చిత్రమే డంకి. భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలు ఏంటో చూద్దాం పదండి.
కథ:
హర్డీ సింగ్ (షారుఖ్) ఒక సైనికుడు. ఒక యుద్ధంలో తనని కాపాడిన వ్యక్తిని వెతుక్కుంటూ పంజాబ్ లోని ఒక ఊరికి వెళ్తాడు. తనకు సాయం చేసిన వ్యక్తి ప్రాణాలతో లేడని.. తన చెల్లెలు మను (తాప్సీ) సహా కుటుంబం అంతా ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుంటాడు. ఆమెకి సాయం చెయ్యాలని నిర్ణయించుకుని అక్కడే ఉండిపోతాడు. తన కష్టాలు తీరాలంటే లండన్ వెళ్ళడమే మార్గం అనుకుంటుంది మను. ఆమెతో పాటు తన స్నేహితులదీ అదే ఆలోచన. వీళ్లందరినీ లండన్ తీసుకెళ్లడానికి హార్డీ ఏం చేశాడు... తన ప్రయత్నం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం- విశ్లేషణ:
కథ సింపుల్ గానే అనిపించినా.. లైవ్లీగా ఉండే పాత్రలతో సిచువేషనల్ కామెడీని పండిస్తూ ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తి.. చివరికి ఎమోషన్లలో తడిసి ముద్దయ్యేలా చేసే దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. మున్నాభాయ్ సిరీస్ మొదలుకొని.. సంజు వరకు ఆయనది అదే శైలి. ఇప్పుడు డంకితో మరోసారి ఆయన అదే ప్రయత్నం చేశాడు. ఇది కచ్చితంగా ఓ భిన్నమైన ప్రయత్నమే. ఇందులోనూ హిరానీ ముద్ర లేకపోలేదు. కానీ ఆయన గత సినిమాల్లో మాదిరి వినోదం, ఎమోషన్లు పతాక స్థాయిని మాత్రం అందుకోలేదు. కాన్సెప్ట్ బాగున్నా, వినోదం వరకు ఓకే అనిపించినా ప్రధాన పాత్రలతో డీప్ ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల హిరానీ గత సినిమాల మాదిరి డంకి ప్రేక్షకులను వెంటాడదు.
సంజయ్ దత్ బయోపిక్ అయిన సంజును పక్కన పెడితే.. రాజ్ కుమార్ హిరానీ సినిమాలన్నింట్లోనూ ఆలోచింపజేసే, అందరూ రిలేట్ చేసుకునే ఒక సందేశంతో కూడిన కాన్సెప్ట్ ఉంటుంది. మున్నాభాయ్ సిరీస్ లో మనిషిని ప్రేమతో గెలవమని అంటాడు. 3 ఇడియట్స్ లో కెరీర్ విషయంలో మనసుకు నచ్చింది చేయమంటాడు. పీకేలో మానవత్వాన్ని మించిన దైవత్వం లేదంటాడు. ఇలా ఎక్కువమంది రిలేట్ చేసుకునే కాన్సెప్ట్స్ ఎంచుకుని వాటిని జనరంజకంగా డీల్ చేయడంతో హిరానీకి ఫుల్ మార్క్స్ పడిపోయాయి. అయితే ఈసారి అలాంటి యూనివర్సల్ కాన్సెప్ట్ ఎంచుకోలేదు హిరానీ. దేశాల్లోకి అక్రమ వలసల నేపథ్యంలో కథను అల్లుకోవడంతోనే డంకి పరిధి కుచించుకుపోయినట్లు అయింది. యూరప్ దేశాలు అక్రమ వలసదారుల కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి కథను చెప్పడం రాంగ్ టైమింగ్. వలసదారులు అక్రమ మార్గాల్లో ఒక దేశంలోకి చొరబడ్డానికి ఎన్నెన్ని అవస్థలు పడతారో.. ఆ దేశంలో అడుగుపెట్టాక కూడా వారి జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో హృద్యంగానే చెప్పినప్పటికీ.. ఈ కథలోని ప్రధాన పాత్రధారులు ఉన్న ఊరు విడిచిపెట్టి లండన్ వెళ్లడానికి బలమైన కారణాలు కనిపించకపోవడంతో ఎమోషన్ వర్కౌట్ కాలేదు. ఒక్క విక్కీ కౌశల్ పాత్రకు మాత్రమే లండన్ వెళ్లడానికి బలమైన కారణం ఉంటుంది. ఆ పాత్ర వ్యవహారం మధ్యలోనే ముగిసిపోతుంది. మిగతా పాత్రలన్నిటికీ చిన్న చిన్న సమస్యలే. ఆ సమస్యలకు లండన్ వెళ్లడం ఎంత మాత్రం పరిష్కార మార్గంలా కనిపించదు. మరి ప్రాణాలకు పణంగా పెట్టి అక్రమ మార్గంలో ఇండియా నుంచి లండన్ వెళ్లడం ఎంత మాత్రం సముచితంగా అనిపించదు. ఈ విషయంలో హిరానీ ప్రేక్షకులను కన్విన్ చేయలేకపోవడంతో డంకి కృత్రిమంగా తయారయింది.
అయితే డంకి కాన్సెప్ట్ సంగతి పక్కన పెడితే.. ప్రథమార్థంలో వినోదాన్ని పండించడంలో మాత్రం హిరాని సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా లండన్ వీసా కోసం హీరో అండ్ కో పడే పాట్లు కడుపుబ్బ నవ్విస్తాయి. ఈ గ్యాంగ్ అంతా ఇంగ్లీష్ క్లాసులో చేరడం దగ్గర్నుంచి వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసే వరకు ప్రతి సీన్ హిలేరియస్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా వీసా ఇంటర్వ్యూ ఎపిసోడ్ అయితే భలే తేలింది. ఇక్కడే హిరానీ మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక విక్కీ కౌశల్ పాత్రతో భావోద్వేగాలను కూడా తట్టి లేపుతాడు దర్శకుడు. ప్రథమార్తం వరకు కామెడీ, ఎమోషన్ల పర్ఫెక్ట్ బ్లెండ్ లాగా అనిపిస్తుంది డంకి. కానీ ద్వితీయార్థంలో సినిమా గాడి తప్పింది. హీరో అండ్ గ్యాంగ్ దేశాల సరిహద్దులను దాటుతూ లండన్ చేరే క్రమం కొంత అతిశయోక్తి ఇలా అనిపిస్తుంది. తమను బందీలుగా పట్టుకున్న పాకిస్థాన్ సైనికులను హీరో మట్టుపెట్టే ఎపిసోడ్ ఒకటి బాగా పేలినా మిగతా సన్నివేశాలు ఏమంత ఎఫెక్టివ్ గా అనిపించవు. ఇక లండన్ లో వచ్చే సన్నివేశాలు బోరింగ్ గా.. అనాసక్తికరంగా అనిపిస్తాయి. అసలు హీరో నేపథ్యం ఏంటి.. అతను ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనే ప్రశ్నలు రేకెత్తిస్తుంది కథనం. హీరో హీరోయిన్ల బంధాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల వారి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో ఫీల్ లేకపోయింది. షారుఖ్ -తాప్సీ మధ్య కెమిస్ట్రీ ఏమాత్రం వర్కౌట్ కాకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. అందువల్లే పతాక సన్నివేశాలు కూడా పేలలేదు. మొత్తంగా చూస్తే రెండున్నర గంటల సమయం ఏదో అలా అలా గడిచిపోతుంది హిరానీ మార్కు సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలగదు. జస్ట్ టైం పాస్ చేయడానికి అయితే డంకి ఓకే కానీ అంతకుమించి ఆశిస్తే కష్టమే.
నటీనటులు:
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాల్లో వీరలెవల్లో హీరోని పండించిన షారుఖ్.. డంకిలో ఒక సాధారణ వ్యక్తిగా బాగానే మెప్పించాడు. సినిమాను చాలా వరకు తన భుజాల మీద మోసే ప్రయత్నం చేశాడు షారుఖ్. కామెడీ పండించడంలో తన ప్రత్యేకతను అతని చాటుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో షారుక్ నటన కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. అందుకు కారణం తన పాత్ర చిత్రణ. షారుఖ్ పాత్రకు ఒక విచిత్రమైన డైలాగ్ డెలివరీ పెట్టగా.. అది వినోదం వరకు బాగానే అనిపించినా, ఎమోషనల్ సీన్లలో తేడా కొట్టేసింది. దానివల్ల సీరియస్ సీన్లు కూడా కొంచెం కామెడీగా తయారయ్యాయి. తాప్సీ పన్ను మను పాత్రలో మెప్పించింది. పాత్రకు తగ్గట్టుగా సాధారణ అమ్మాయిలా కనిపించిన ఆమె.. చక్కగా హావభావాలు పలికించింది. ఆమెకి ఇది గుర్తుండిపోయే క్యారెక్టరే. విక్కీ కౌశల్ కనిపించిన కాసేపు చక్కటి నటనతో కట్టిపడేశాడు. విక్రమ్ కోచర్ అచ్చమైన పంజాబీ కుర్రాడిలా సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. అనిల్ గ్రోవర్ కూడా బాగా నటించాడు. బొమన్ ఇరానీ పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు కానీ ఆయన నటన ఓకే. మిగతా నటీనటులు అందరూ మామూలే.
సాంకేతిక వర్గం:
ప్రీతమ్ సంగీతం సోసోగా అనిపిస్తుంది. పాటలు అలా అలా సాగిపోయాయి కానీ గుర్తుంచుకునేలా లేవు. అమన్ పంత్ నేపథ్య సంగీతం బాగా సాగింది. సినిమాకు నలుగురు చాయాగ్రాహకులు పనిచేశారు. సినిమాటోగ్రఫీ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉత్తమ స్థాయిలో సాగాయి. ఇద్దరు రచయితల సాయంతో రాజ్ కుమార్ హిరానీ వండిన స్క్రిప్టులో కొన్ని మెరుపులు ఉన్నాయి. హిరానీ ఒక కొత్త కథను చెప్పాలని చూశాడు. కానీ తన గత సినిమాల స్థాయిలో ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో విఫలమయ్యాడు. ఎమోషన్లను సరిగా పండించలేకపోయాడు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగినా.. తన మార్కు పరిపూర్ణమైన సినిమాను మాత్రం అందించలేకపోయాడు.
చివరగా: డంకి.. ఎంటర్టైన్మెంట్ ప్లస్.. ఎమోషన్ మిస్
రేటింగ్: 2.5/5