డుంకీ Vs సలార్: వార్ నుంచి తప్పుకున్న యోధుడు
షారుఖ్ ఖాన్, ప్రభాస్‌లపై గౌరవంతో కరణ్ జోహార్ ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యోధా విడుదల తేదీని మార్చాడు.
By: Tupaki Desk | 3 Oct 2023 11:00 AM GMTడిసెంబర్ 22న ప్రభాస్ నటించిన సలార్ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించడంతో పరిశ్రమ ఆశ్చర్యపోయింది. తద్వారా షారుఖ్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ చిత్రం 'డుంకీ'తో ఘర్షణ ఖరారైంది. యాక్షన్ చిత్రం 'సలార్' మొదట సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు అది క్రిస్మస్ వీక్ కి షిఫ్టయింది. అదే నెలలోని ఇతర విడుదలలపైనా ఇది ప్రభావం చూపింది.
అయితే డుంకీ వర్సెస్ సలార్ ఘర్షణ ఎలా ఉన్నా కానీ.. షారుఖ్ ఖాన్, ప్రభాస్‌లపై గౌరవంతో కరణ్ జోహార్ ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యోధా విడుదల తేదీని మార్చాడు. డిసెంబర్ 15న విడుదల కావాల్సిన యోధ మరో తేదీకి వెళ్లనుందని తెలిసింది. యోధను కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. డుంకీ -సలార్ థియేటర్లలోకి వచ్చిన తర్వాత రెండవ వారంలో యోధాకు స్క్రీన్‌లను నిలుపుకోవడం కష్టమని కరణ్ గ్రహించాడు. అంతేకాకుండా డుంకీ - సలార్ పంపిణీదారులకు కూడా ఇది సవాలుగా మారుతుంది. ఎందుకంటే థియేటర్లు యోధాను కోల్పోవడం సరికాదు. బాగా ఆడినా పెద్ద సినిమాల వల్ల తొలగించాల్సి వస్తే అది బాధాకరమైన అనుభవంగా మారుతుంది. అందుకే కరణ్ ఇప్పుడు తెలివైన నిర్ణయం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు.
కరణ్ జోహార్‌కి షారుఖ్ ఖాన్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇది బాగా తెలిసిన విషయమే. అలాగే KJo హిందీలో బాహుబలి సిరీస్‌ని విడుదల చేసినప్పటి నుండి అతడు ప్రభాస్‌తో సన్నిహితంగా ఉన్నాడు. అందుకే షారుఖ్ ఖాన్ - ప్రభాస్‌లపై గౌరవంతో 'యోధ'ను వేరే తేదీకి మార్చాలని నిర్ణయించుకున్నాడు. యోధా 2024కి వాయిదా పడుతుందా లేక కరణ్ దానిని డిసెంబర్ 8కి లేదా నవంబర్‌లో మరేదైనా తేదీకి ప్రీపోన్ చేస్తారా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. యోధాలో సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ, రాశి ఖన్నా నటించారు. దీనికి సాగర్ అంబ్రే -పుష్కర్ ఓజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ముందుగా సెప్టెంబర్ 15 న విడుదల కావాల్సి ఉంది. సూపర్ స్టార్ షారూఖ్ నటించిన 'జవాన్' సెప్టెంబర్ 7 స్లాట్‌ను తీసుకున్నందున షారుఖ్ ఖాన్ కోసం డిసెంబర్ 15కి కరణ్ వాయిదా వేసాడు. ఇప్పుడు మరోసారి షారూఖ్ కోసం అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
పరిశ్రమ సోర్స్ అందించిన వివరాల ప్రకారం.. ''డిసెంబర్ 21, గురువారం నాడు డుంకీ విడుదల కావచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒక రోజు ముందు విడుదలైతే, భారతదేశంలో కూడా ముందుగా విడుదల ఖాయమైనట్టే. ఆ మరునాడే సలార్ విడుదలవుతుంది. అటువంటి సమయంలో రెండు పెద్ద సినిమాలకు 6-7 రోజుల ముందు రావడం వల్ల యోధాకు నష్టం కలుగుతుందని కరణ్ భావిస్తున్నారు.
డిసెంబర్ 15న విడుదల కానున్న యోధ సినిమా మాత్రమే కాదు. కత్రినా కైఫ్-విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ కూడా డిసెంబర్ 15 తేదీని బుక్ చేసుకుంది. ఈ సినిమా దర్శకనిర్మాతలు కూడా తమ తేదీని మార్చుకుంటారా లేదా వారు అనుకున్న ప్రకారం డుంకీ -సలార్‌లకు ఒక వారం ముందు రావాలని నిర్ణయించుకుంటారా అనేది ఇప్పుడు చూడాలి.