డుంకీ (X) సలార్: ఫ్యాన్ వార్ అన్‌లిమిటెడ్
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో షారుఖ్ ఖాన్ Vs ప్రభాస్ వార్ గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Oct 2023 4:29 AM GMTక్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో షారుఖ్ ఖాన్ Vs ప్రభాస్ వార్ గురించి తెలిసిందే. ఖాన్ నటించిన డుంకీ, ప్రభాస్ నటించిన సలార్ థియేటర్‌లను స్వాధీనం చేసుకోవడంలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. రెండు పెద్ద సినిమాలు ఒకే సీజన్ లో ఒకే తేదీకి లేదా పక్క పక్క తేదీల్లో థియేటర్లకు వస్తే దాని ప్రభావం ఇరు సినిమాలపైనా తీవ్రంగా ఉంటుందన్నది తెలిసిన నిజం. కానీ ఈ క్రిస్మస్ సీజన్ ని వదులుకునేందుకు ఆ ఇద్దరిలో ఎవరూ సిద్ధంగా లేరు. ఇది ఆన్ లైన్ లో బోలెడంత ఫ్యాన్ వార్ కి దారి తీసింది. ప్రభాస్ ఫ్యాన్స్ వర్సెస్ షారూఖ్ ఫ్యాన్స్ యుద్ధం ఇప్పుడు ట్రెండీ టాపిక్ గా మారింది. ఎవరికి వారు మా సినిమా గొప్పది అంటే మా సినిమా గొప్పది అంటూ అభిమానులు బీరాలు పోతున్నారు.
సినీప్రియులు, అభిమానులందరికీ ఈ డిసెంబర్ చాలా స్పెషల్ కానుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా భారీ విడుదలలు ఉన్నాయి. డిసెంబర్ 1న విడుదల కానున్న రణబీర్ కపూర్ -రష్మిక మందన్నల `యానిమల్` మొదలు.. ఇదే నెలలో క్రిస్మస్ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద రెండు ప్రధాన చిత్రాలైన సలార్ - డుంకీ ఢీకొంటున్నాయి. ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో షారుఖ్ ఖాన్ సినిమా డుంకీ క్లాష్ అతి భారీ క్లాష్. రెండు సినిమాలూ ఒక్కరోజు గ్యాప్‌లో విడుదలవుతుండడంతో అందరి దృష్టి బాక్సాఫీస్ నంబర్లపైనే ఉంది. అయితే ఏ సినిమాపై అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు? అంటే ఇరువురు స్టార్లకు సొంత ఫ్యాన్ బేస్ ఉంది గనుక థియేటర్లు కిటకిటలాడడం ఖాయమని అంచనా వేస్తున్నారు. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ అన్నిరోజులను సెలవులు కలుపుకుని ఎన్ క్యాష్ చేసుకోవాలని షారూఖ్, ప్రభాస్ ఇరువురూ బిగ్ ప్లాన్ తో వస్తున్నారు.
సలార్ ను బీట్ చేస్తుందా?
డుంకీ వర్సెస్ సలార్ బిగ్ ఫైట్ లో ఏ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు? అంటే దానికి సమాధానం ఇప్పుడే సిద్ధంగా లేదు. సలార్ మాస్ సినిమా. డుంకీ అర్బన్ ఆడియెన్ కి నచ్చే సినిమా అని పలువురు విశ్లేషిస్తున్నారు. పైగా ప్రభాస్ కి సౌత్ నార్త్ అనే విభేధం లేకుండా భారీ ఫాలోయింగ్ ఉంది. అతడు రియల్ పాన్ ఇండియా స్టార్.
మరోవైపు పఠాన్, జవాన్ చిత్రాలతో ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ కూడా సౌత్ లో భారీ ఫాలోయింగ్ పెంచుకున్నడు. అందువల్ల ఇరువురు స్టార్ల సినిమాలకు హైప్ భారీగా ఉంది. కేజీఎఫ్ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమాగా సలార్ పై భారీగా ఆసక్తి నెలకొంది. అలాగే రాజ్ కుమార్ హిరాణీ లాంటి అపజయమెరుగని దర్శకుడి నుంచి డుంకీ వస్తోంది గనుక, అది క్లాసిక్ గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందువల్ల డిసెంబర్ లో ఈ రెండూ మోస్ట్ అవైటెడ్ చిత్రాలుగా బరిలో దిగుతున్నాయి. డుంకీ డిసెంబర్ 21న విడుదలవుతుండగా, సాలార్ 22న విడుదల కానుంది. ఆ రెండు రోజులు భారీగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదవుతాయని భావిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు సల్మాన్- టైగర్ 3 రికార్డుల్ని కూడా బ్రేక్ చేస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు.
పఠాన్ - జవాన్ ల విజయం
షారుఖ్ ఖాన్ కి ఇది చాలా మంచి సంవత్సరం. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు కొట్టాడు. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న అతను `డుంకీ`తో హ్యాట్రిక్ కొట్టాలని కసిగా ఉన్నాడు. బోమన్ ఇరానీ ఇటీవల ఈ చిత్రం సమీక్షను షేర్ చేసాడు. డుంకీ చాలా బాగా వచ్చిందని ఈ సీనియర్ నటుడు పేర్కొన్నారు. షారుఖ్ ఖాన్ పఠాన్ - జవాన్ చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల మార్కును దాటాయి. డుంకీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.
ప్రభాస్ ఇటీవలి ఫ్లాప్‌లు
మరోవైపు గత విడుదలైన `ఆదిపురుష్`తో ప్రభాస్ కాస్త పరాజయాన్ని చవిచూశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేదు. కానీ ప్రభాస్ ఛరిష్మాతో భారీ ఓపెనింగులు సాధ్యమయ్యాయి. గత చిత్రాలు రాధే శ్యామ్- సాహో కూడా మంచి ప్రదర్శన ఇవ్వలేదు. కానీ ప్రభాస్ కోసం జనం భారీగా థియేటర్లకు తరలి రావడంతో ఓపెనింగులు భారీగా వచ్చాయి. అయితే ఈ పరాజయాలతో సంబంధం లేకుండా సలార్ పై భారీ క్రేజ్ నెలకొంది. ప్రభాస్ కి మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అతడి సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అతడి యాక్షన్ అవతార్ ని మళ్లీ మళ్లీ చూడాలని అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. అతడు మళ్లీ ట్రాక్‌లోకి వస్తాడని ఆశిస్తున్నారు. ఇక కేజీఎఫ్-కేజీఎఫ్ 2 చిత్రాలతో ప్రశాంత్ నీల్ సంచలనంగా మారాడు. సలార్ టీజర్ తోనే ఉత్కంఠను పెంచాడు. కేజీఎఫ్ 2తో 1000 కోట్ల క్లబ్ ని అందుకున్నాడు గనుక ఇప్పుడు ప్రభాస్ కి సలార్ రూపంలో మరో 1000 కోట్ల క్లబ్ ని అందిస్తాడని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా డుంకీ- సలార్ చిత్రాలకు ప్రారంభ టాక్ ఎలా వస్తుందో దానిని బట్టి, జనంలో రియల్ మౌత్ టాక్ ని బట్టి కూడా కలెక్షన్స్ సాధ్యమవుతాయి.