Begin typing your search above and press return to search.

దసరా సినిమాలు.. ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ ఏది?

టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత దసరా పండుగను సినిమాలకు అతి పెద్ద సీజన్ గా భావిస్తుంటారు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 7:38 AM GMT
దసరా సినిమాలు.. ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ ఏది?
X

టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత దసరా పండుగను సినిమాలకు అతి పెద్ద సీజన్ గా భావిస్తుంటారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ.. అందరూ ఫెస్టివల్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఈసారి విజయదశమికి పెద్ద సినిమాలు లేవు. అర డజనుకు పైగా రిలీజులు ఉన్నాయి కానీ, వాటిల్లో మన అగ్ర హీరోలు నటించిన చిత్రాలేమీ లేవు. 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక', 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' వంటి నాలుగు తెలుగు సినిమాలు.. వేట్టయన్, మార్టిన్, జిగ్రా లాంటి మూడు డబ్బింగ్ మూవీస్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాయి.

గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికైతే దసరా సినిమాల్లో దీనికే అంతో ఇంతో బజ్ కనిపిస్తోంది. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. చాలా కాలంగా సరైన సక్సెస్ లేని గోపీచంద్, వైట్ల శ్రీను ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. దర్శకుడు తన మార్క్ ఫన్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చారు.

సుధీర్ బాబు హీరోగా నటించిన 'మా నాన్న సూపర్ హీరో' సినిమా కూడా అక్టోబరు 11వ తేదీనే వస్తోంది. లూసర్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంటుతో తీసిన ఎమోషనల్ మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ ప్రమోషన్స్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాయి.

సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'జనక అయితే గనక'. దిల్‌ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది. ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌ లో పెళ్లైన కొత్త జంటలు ఓ బిడ్డకు జన్మనివ్వడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు అనే కొత్త పాయింట్ ను చర్చించబోతున్నారు. ఇటీవల రిలీజైన ట్రెయిలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

రజనీకాంత్ హీరోగా నటించిన 'వేట్టయన్: ది హంటర్' సినిమా అక్టోబరు 10వ తారీఖున అన్ని భాషలలో పాటుగా తెలుగులోనూ విడుదలకానుంది. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకుడు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని మన దగ్గర రిలీజ్ చేస్తోంది. ఎందుకనో తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు.

అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా నటించిన కన్నడ డబ్ మూవీ 'మార్టిన్' కూడా ఫెస్టివల్ రేసులో నిలుస్తోంది. అక్టోబర్ 11న ధియేటర్లలో విడుదల కానుంది. ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన హిందీ డబ్బింగ్ మూవీ 'జిగ్రా' సైతం అదే రోజున రిలీజ్ అవుతోంది. హీరో రానా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వీటి మధ్యలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' అనే సినిమా కూడా వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబరు 10న రానుంది. ఇలా వేటికవే ప్రత్యేకమైన 7 సినిమాలు దసరా బరిలో నిలుస్తున్నాయి. వీటిల్లో ఏవేవి ఆడియన్స్ ను ఆకట్టుకొని మంచి వసూళ్లు రాబడతాయో చూడాలి.