Begin typing your search above and press return to search.

దసరా రోజు వారికి పండుగ కాదు... 166 ఏళ్ల చేదు జ్ఞాపకం!

రామ సహాయ్, రమణ్ సింగ్, హర్జీత్ సింగ్, హిమాత్ సింగ్, కేదార సింగ్, ఘసితా సింగ్, బైరాం, దర్యాబ్ సింగ్‌, షిబాత్ సింగ్ లను బంధించిన బ్రిటిషర్లు సరిగ్గా విజయ దశమి రోజున గగోల్‌ గ్రామంలోని రావి చెట్టుకు ఉరి తీశారు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 9:16 AM GMT
దసరా రోజు వారికి పండుగ కాదు... 166 ఏళ్ల చేదు జ్ఞాపకం!
X

దసరా పండగ వచ్చిందంటే కుటుంబాల్లో ఎక్కడ లేని ఆనందం! పిల్లలకు స్కూల్ హాలిడేస్ కూడా సుమారు 10 రోజులు ఉండటంతో ఇళ్లంతా సందడిగా ఉంటుంది. ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం ఈ పండక్కి ఊరికి వస్తారు.. అంతా కలిసి ఆనందంగా గడుపుతారు. ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా విజయ దశమిని ఆనందోత్సాహాలతో జరుపుకొన్న సంగతి తెలిసిందే. అయితే దేశంలో ఒక గ్రామం మాత్రం ఈ పండగలకు దూరం.

అవును... దేశమంతటా విజయ దశమిని ఆనందోత్సాహాలతో జరుపుకొంటుంటే ఇదే దేశంలోని ఒక గ్రామం మాత్రం మౌనంగా ఉంటుంది. సంబరాలకు దూరంగా ఉంటుంది. అవును... విజయదశమి రోజున ఓ గ్రామ ప్రజలు మాత్రం పండగ చేసుకోరు. అమర వీరులను స్మరించుకుంటూ ఆ రోజంతా సంతాపం పాటిస్తారు. అది ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా గత 166 ఏళ్లుగా దీనిని కొనసాగిస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని మేరఠ్‌ జిల్లా గగోల్‌ గ్రామ వాసులు 1857 నుంచి ఆ ప్రాంతంలో దసరా పండుగ జరుపుకోరు. కారణం... గగోల్‌ దాని చుట్టుపక్కల గ్రామాలైన పంచ్లి, నంగ్లా, ఘాట్, గుమి, నూర్‌ నగర్, లిసందికి చెందిన ప్రజలు సర్దార్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి ధన్‌ సింగ్‌ నేతృత్వంలో మీరట్ జైలుపై దాడి చేశారు. ఆ దాడిలో అక్కడ జైలులో మగ్గుతున్న బందీలను విడిపించారు. దీంతో బ్రిటీషర్లు సీరియస్ అయ్యారు.

ఇక్కడ నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందనే ఆందోళన వారికి బలంగా కలిగిందనే చెప్పుకోవచ్చు. దీంతో ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు క్రూరంగా అణచివేశారు. ఇకపై ఇంకెవరూ స్వాతంత్రం అనే పేరెత్తకుండా భయభ్రాంతులకు గురించేశారు. ఇందులో భాగంగా... తొమ్మిది మంది విప్లవకారులను అత్యంత క్రూరంగా ఉరి తీశారు.

రామ సహాయ్, రమణ్ సింగ్, హర్జీత్ సింగ్, హిమాత్ సింగ్, కేదార సింగ్, ఘసితా సింగ్, బైరాం, దర్యాబ్ సింగ్‌, షిబాత్ సింగ్ లను బంధించిన బ్రిటిషర్లు సరిగ్గా విజయ దశమి రోజున గగోల్‌ గ్రామంలోని రావి చెట్టుకు ఉరి తీశారు. ఆ దారుణ సంఘటన స్థానికులపై చెరగని ముద్ర వేసింది. నూట ఏభై ఏళ్లు దాటినా మరిచిపోలేని విషాద ఘటనగా మిగిలిపోయింది.

అప్పటి నించి గగోల్‌ ప్రజలు విజయదశమి వేడుకలకు జరుపుకోవడంలేదు. 166 ఏళ్లుగా నాటి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ విజయదశమికి దూరంగా ఉంటున్నారు. వారికి విజయదశమి గుర్తుకువస్తే పండుగ కాదు.. అదొక విషాధమైన రోజు.. తొమ్మిది మంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రోజుగా వారు భావిస్తారు! తొలి స్వాతంత్ర పోరాటంగా నాటి సంఘటనను చెబుతుంటారు.

కాగా, శతాబ్ద కాలంగా ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారతీయుల్లో పేరుకుపోతూ వచ్చిన అసంతృప్తి జ్వాల 1857 తిరుగుబాటు రూపంలో చెలరేగిన సంగతి తెలిసిందే. యూరోపియన్లలో కొందరు దీన్ని "సిపాయిల తిరుగుబాటు" అని పేర్కొనగా, మరికొందరు దీన్ని జాతుల మధ్య పోరాటం, నాగరికత - ఆటవికత మధ్య సాగిన సంఘర్షణ అని పేర్కొన్నారు. అయితే... భారతదేశంలోని జాతీయవాదులు, చరిత్రకారులు మాత్రం దీన్ని ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొన్నారు.