Begin typing your search above and press return to search.

అంత‌ర్జాతీయ గాయ‌కుడితో 'బుట్ట బొమ్మా' గాయ‌కుడు షో

ఇప్పుడు అర్మాన్ హైదరాబాద్‌లో ఎడ్ కోసం వేదికను ఏర్పాటు చేస్తూ అంత‌ర్జాతీయంగా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ స్థాయి ప్రత్యక్ష సంగీత‌ కచేరీ ఒక గొప్ప మైలు రాయిగా నిల‌వ‌నుంది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 4:16 AM GMT
అంత‌ర్జాతీయ గాయ‌కుడితో బుట్ట బొమ్మా గాయ‌కుడు షో
X

అంత‌ర్జాతీయ పాప్ స్టార్స్ ఇటీవ‌లి కాలంలో ఇండియాలో మ్యూజిక్ షోలు నిర్వ‌హించేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. ముంబై, బెంగ‌ళూరుతో పాటు హైద‌రాబాద్ కి పెరుగుతున్న ఇమేజ్ కి అనుగుణంగా భారీ కాన్సెర్టుల నిర్వ‌హ‌ణ‌కు ఇటీవ‌ల‌ ప్లాన్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఇప్పుడు పాపుల‌ర్ గ్లోబ‌ల్ మ్యూజిక్ ఐకాన్ ఎడ్ షీర‌న్ హైద‌రాబాద్ లో త‌న తొలి మ్యూజిక్ కాన్సెర్ట్ ప్లాన్ చేయ‌డం సంగీత ప్రియుల్లో ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

హైదరాబాద్‌లో జరిగే మొట్టమొదటి అంతర్జాతీయ కచేరీలో ఎడ్ షీరన్ తో పాటు 'బుట్ట బొమ్మా' గాయ‌కుడు అర్మాన్ మాలిక్ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ర‌క్తి క‌ట్టించనున్నారు. ఫిబ్రవరి 2న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే మొట్టమొదటి అంతర్జాతీయ కచేరీతో హైదరాబాద్ ఒక చారిత్రాత్మక ఘ‌ట్టానికి తెర తీయ‌బోతోంది. గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్ ఎడ్ షీరన్ రాక‌తో హైదరాబాద్ తన మొట్టమొదటి అంతర్జాతీయ కచేరీని నిర్వహిస్తున్న ఘ‌న‌త‌ను సాధించ‌నుంది. ముంబైలో ఎడ్ షీర‌న్ తో క‌లిసి ఆర్మాన్ మాలిక్ భారీ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్ట‌గా, ఇప్పుడు రెండోసారి ఇద్ద‌రు దిగ్గ‌జాలు క‌లిసి అభిమానుల‌ను ఉర్రూత‌లూగించ‌బోతున్నారు. భారతీయ పాప్ సంచలనం అర్మాన్ మాలిక్ ఒక ప్రత్యేక ప్రదర్శనగా ఎడ్ కోసం ప్రారంభోత్సవ వేడుక‌ను ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో 'బుట్టా బొమ్మా..' పాట‌తో తెలుగు వారి మ‌న‌సులు గెలుచుకున్న గాయ‌కుడు ఆర్మాన్ కెరీర్ లో ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌ల‌ను ఆల‌పించారు. యు, కంట్రోల్ వంటి హిట్ పాట‌లు అతడి ఖాతాలో ఉన్నాయి. అర్మాన్ భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో ముందంజలో ఉన్నారు. భారతీయ సాంప్ర‌దాయ పాప్‌ను, అంతర్జాతీయ పాప్‌తో మిళితం చేసే సామర్థ్యం అతడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

షేప్ ఆఫ్ యు, పర్ఫెక్ట్, బ్యాడ్ హ్యాబిట్స్ వంటి అద్భుతమైన హిట్ పాట‌లతో గ్లోబల్ సంగీతకారుడు ఎడ్ షీరాన్ భార‌త‌దేశంలోను భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అత్యంత శ‌క్తివంత‌మైన ఉత్సాహ‌భ‌రిత‌మైన‌ ప్రదర్శనలతో ఎడ్ షీర‌న్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉన్నారు.

ఇద్ద‌రు దిగ్గ‌జ‌ గాయ‌కులు గతంలో '2స్టెప్'లో కలిసి పనిచేశారు. ఇది ఎడ్ షీరాన్ హిట్ ట్రాక్ ప్రత్యేక భారతీయ రీమిక్స్ కావ‌డంతో భార‌త‌దేశంలోను యువ‌త‌ను ఉర్రూత‌లూగించింది. ఇప్పుడు అర్మాన్ హైదరాబాద్‌లో ఎడ్ కోసం వేదికను ఏర్పాటు చేస్తూ అంత‌ర్జాతీయంగా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ స్థాయి ప్రత్యక్ష సంగీత‌ కచేరీ ఒక గొప్ప మైలు రాయిగా నిల‌వ‌నుంది. దీనిని 'షీరాన్ 2025 + - = ÷ x ఇండియా టూర్‌'లో భాగంగా ప్లాన్ చేయ‌డం సంగీత ప్రియుల‌ను ఆక‌ర్షిస్తోంది.

పూణే, హైద‌రాబాద్, చెన్నై, బెంగ‌ళూరులో షీర‌న్ వ‌రుస‌గా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నారు. షీరాన్ ఫిబ్రవరి 12న జెఎన్ స్టేడియంలో జరిగే ప్రదర్శన కోసం షిల్లాంగ్‌కు వెళ‌తారు. అటుపై ఫిబ్రవరి 15న ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో లీజర్ వ్యాలీ గ్రౌండ్‌లో చివ‌రి కాన్సెర్ట్ తో ముగుస్తుంది. ఇప్ప‌టికే షీర‌న్ షోల‌కు సంబంధించిన టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.