షీరన్ స్ట్రీట్ షోకు పోలీసులు బిగ్ బ్రేక్.. ఫ్యాన్స్ సీరియస్!
అయితే ఇలాంటి సెషన్స్‌కి అధికారిక అనుమతి లేకపోవడంతో స్థానిక పోలీసులు ఆకస్మిక ప్రదర్శనను నిలిపివేశారు.
By: Tupaki Desk | 10 Feb 2025 9:14 AM ISTబ్రిటిష్ గాయకుడు, గేయ రచయిత ఎడ్ షీరాన్ భారత్ టూర్ ఇటీవల సంచలనంగా మారింది. అతడు దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో భారీ షోలతో అలరిస్తుంటే దానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఇటీవలే చెన్నైలో రెహమాన్ తో కలిసి ప్రజల్ని ఉర్రూతలూగించాడు. ఇప్పుడు నైస్ గ్రౌండ్స్‌లో షెడ్యూల్ చేసిన కచేరీకి ముందు బెంగళూరులోని ఐకానిక్ చర్చి స్ట్రీట్‌లో ఆకస్మిక జామింగ్ సెషన్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే ఇలాంటి సెషన్స్‌కి అధికారిక అనుమతి లేకపోవడంతో స్థానిక పోలీసులు ఆకస్మిక ప్రదర్శనను నిలిపివేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. దీంతో షీరన్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. చాలా మంది ఈ అంతరాయంపై నిరాశను వ్యక్తం చేశారు. ప్రపంచ సంగీత దిగ్గజం స్ట్రీట్ ప్రదర్శనను చూసే అవకాశాన్ని కోల్పోయామని ఆవేదన చెందారు. అలాంటి అరుదైన ఉత్సాహాన్ని అణచివేయడం నిరాశపరిచిందని, అభిమానులు చాలా క్లోజ్ గా కలిసేందుకు అవకాశం కోల్పోయామని ఆవేదనను వ్యక్తం చేసారు.
అయితే కళాకారుల విషయంలో అపార గౌరవం ఉన్నా కానీ, పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షించే ప్రజా ప్రదర్శనలకు భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందని...దానికి ముందస్తు అనుమతి అవసరమని బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు. మా ఆందోళన అంతా కళాకారుడితో పాటు ప్రజల భద్రత. అనధికార షోలు సమావేశాల నిర్వహణ చాలా కష్టతరమైనది అని అన్నారు. ఎడ్ షీరాన్ ఫిబ్రవరి 8 , 9 తేదీల్లో NICE గ్రౌండ్స్‌లో ప్రదర్శనలతో తన “+-=÷x టూర్”లో భాగంగా బెంగళూరులో ఉన్నారు. ఈసారి షీరన్ భారత్ టూర్ పెద్ద సక్సెసైంది. తదుపరి దిల్లీలోని ప్రదర్శనతో టూర్ ని ముగించనున్నాడు.