దేశం పరువు తీసింది.. మహిళా నిర్మాతపై కోర్టు విచారణ
ఇటీవల వరుసగా వివాదాస్పద వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఏక్తా వార్తలకెక్కుతోంది.
By: Tupaki Desk | 16 Feb 2025 8:21 AM GMTటెలివిజన్ రంగంలో పాపులర్ పర్సనాలిటీ, మహిళా నిర్మాత ఏక్తా కపూర్ నిరంతర ప్రయోగాల గురించి తెలిసిందే. వివాదాలతో అంటకాగడం తన హాబీ. తాను ప్రపంచానికి చూపించాలనుకున్న బోల్డ్ కథల్ని, పాత్రల్ని తెరపై చూపిస్తూనే ఉంది. ఇటీవల వరుసగా వివాదాస్పద వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఏక్తా వార్తలకెక్కుతోంది. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌లో భారతీయ సైనికులను అగౌరవపరిచారంటూ క్రిమినల్ కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఏక్తాపై విచారణ జరపాలని శనివారం దిల్లీ కోర్టు నగర పోలీసులను ఆదేశించింది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 202 కింద ఫిర్యాదుపై మే 9 లోపు పోలీసులను నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించంది. ఈ సెక్షన్ కింద ఒక మేజిస్ట్రేట్ క్రిమినల్ ఫిర్యాదుపై విచారణ జరపవచ్చు లేదా పోలీసులను విచారించాల్సిందిగా ఆదేశించవచ్చు.
`హిందుస్థానీ భావు` అనే యూట్యూబ్ చానెల్ నిర్వాహకుడు వికాస్ పాఠక్ ఈ కేసును దాఖలు చేశారు. ఏక్తాతో పాటు, ఆల్ట్ బాలాజీ ఓటీటీపైనా ఆయన ఫిర్యాదు చేసారు. న్యాయవాది అలీ కాశీఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ ఈ కేసును వాదిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఏక్తాపై పిటిషన్ దాఖలు చేసారు.
ఈ ఫిర్యాదు ప్రకారం.. ఆల్ట్ బాలాజీ నిర్మించిన వెబ్ సిరీస్‌లో ఒక సైనిక అధికారి అక్రమంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు చూపించారు. నీచ స్థాయికి దిగజారిన మేకర్స్ భారతీయ సైనికులు ధరించే ఆర్మీ యూనిఫామ్‌ను, జాతీయ చిహ్నాన్ని ఆ సన్నివేశంలో చూపించారు. తద్వారా మన దేశ గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగిందన్నది ఫిర్యాదులో ఆరోపించారు.