Begin typing your search above and press return to search.

నిన్న ఆర్జీవీకి.. నేడు రాకింగ్‌ రాకేష్‌ కు!

ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి మరో 15 రోజుల్లో అంటే నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్నాయి.

By:  Tupaki Desk   |   14 Nov 2023 7:58 AM GMT
నిన్న ఆర్జీవీకి.. నేడు రాకింగ్‌ రాకేష్‌ కు!
X

ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి మరో 15 రోజుల్లో అంటే నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ప్రభావితం చేయడానికి పలు పార్టీల మద్దతుదారులు సినిమాలు నిర్మిస్తున్నారు. తాము అభిమానిస్తున్న పార్టీలకు మద్దతుగా సినిమాలు తీస్తూ ప్రత్యర్థి పార్టీల నేతలను కించపరిచేలా ఈ సినిమాలు ఉంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే రాంగోపాల్‌ వర్మ తీసిన ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాకిచ్చింది. ఇందులో పలువురు నేతలను కించపరిచేలా సీన్లు ఉన్నాయని చెబుతూ ఆ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ జారీ చేయలేదు. ఈ చిత్రాన్ని రాంగోపాల్‌ వర్మ... వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కు మద్దతుగా తీస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు రాంగోపాల్‌ వర్మ కోవలోనే జబర్దస్త్‌ తో పాపులరైన రాకింగ్‌ రాకేష్‌ కు షాక్‌ తగిలింది. కేసీఆర్‌ కు మద్దతుగా ఆయన తీసిన సినిమాకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జీవిత కథ ఆధారంగా రాకింగ్‌ రాకేశ్‌ ఇటీవల ఒక సినిమాను నిర్మించారు. ఇందులో భాగంగా ఇటీవల ఫస్ట్‌ లుక్‌ ను కూడా విడుదల చేశారు. ‘కేసీఆర్‌’ పేరుతో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదలను ఆపేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాకింగ్‌ రాకేష్‌ కు షాక్‌ తగిలింది.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాకింగ్‌ రాకేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సినిమాను నవంబర్‌ 17న కానీ 24న కానీ విడుదల చేయాల్సి ఉందన్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తయ్యాక రిలీజ్‌ ప్రమోషన్స్‌ మొదలుపెడదామని అనుకున్నానని తెలిపారు. ఇంతలోనే ఎన్నికల సంఘం తన సినిమాను ఆపేసిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను ప్రేరేపించే ఇలాంటి రాజకీయ సినిమాల విడుదలకు ఒప్పుకోబోమని ఎన్నికల సంఘం తెలిపిందన్నారు.

ఎన్నికల సంఘం తన సినిమాను ఆపేయడం వెనుక ఎవరి ప్రమేయం లేదని రాకింగ్‌ రాకేశ్‌ తెలిపారు. చట్టం ప్రకారమే తన సినిమా రిలీజ్‌ ఆగిపోయిందన్నారు. ఇది కూడా తన మంచికే అనుకుంటున్నానని వెల్లడించారు. ఇప్పుడు తన సినిమాను మరింతగా ప్రమోట్‌ చేసుకునే అవకాశం దొరికిందన్నారు