కొత్తవి ఢీలా.. పాతవి అలా.. ఎగ్జిబిటర్ల ఆవేదన!
ప్రస్తుతం పాత సినిమాలపైనే ఎగ్జిబిటర్లు ఆధారపడుతున్నారు. కానీ టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి వచ్చేయడంతో ఆ మూవీ వసూళ్లు కూడా తగ్గిపోయాయి.
By: Tupaki Desk | 27 April 2024 11:21 AM GMTటాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత బడా సినిమాల జాడే లేదు. పండుగ కానుకగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వగా.. హనుమాన్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే పండుగ పూట ఫ్యామిలీలతో సినిమాలకు వెళ్తారు కాబట్టి రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆయా చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి. ఆ తర్వాత పలు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఫిబ్రవరి, మార్చిలో రిలీజైన పలు సినిమాలు చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించాయి. విశ్వక్ సేన్ గామి, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన, ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు రాబట్టాయి. ఇటీవల రిలీజైన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఏప్రిల్ లో వచ్చిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మిక్స్ డ్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ఈ రెండూ ఓటీటీలోకి వచ్చేశాయి.
అయితే ఈ మధ్య వరుసగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగానే ఉంటుంది. కొన్ని చిత్రాలు ఫస్ట్ షోతోనే జెండా ఎత్తేస్తున్నాయి. డిజాస్టర్ టాక్ బయటకు వచ్చాక.. ఆడియన్స్ అటువైపు కనీసం చూడడం లేదు. మిక్స్ డ్ టాక్ వస్తే కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వారం పలు సినిమాలు థియేటర్లలోకి రాగా.. విశాల్ రత్నం మూవీ డిజాస్టర్ గా మిగిలింది. పాత కథనే మళ్లీ డైరెక్టర్ హరి చూపించారని రివ్యూలు వచ్చాయి.
కోలీవుడ్ లో రత్నం మూవీ మోస్తరు వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నా.. తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా కంప్లీట్ చేసుకోవడం కష్టమే. జర హట్కే పేరుతో మరో సినిమా రిలీజ్ అయినా.. ఆ మూవీ ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఏదో కొత్తగా ట్రై చేసినా సినీ ప్రియులకు ఎక్కలేదు. హాలీవుడ్ మూవీ గోస్ట్ బస్టర్స్ ఫ్రోజెన్ ఎంపైర్, రుస్లాన్ తదితర సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి.
ప్రస్తుతం పాత సినిమాలపైనే ఎగ్జిబిటర్లు ఆధారపడుతున్నారు. కానీ టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి వచ్చేయడంతో ఆ మూవీ వసూళ్లు కూడా తగ్గిపోయాయి. నెక్స్ట్ వారం వచ్చే సినిమాలపై ఆశలన్నీ పెట్టుకున్నారు ఎగ్జిబిటర్లు. కల్కి వాయిదా పడగా, సుహాస్ ప్రసన్నవదనం, బాక్- అరణ్మయి 4, అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు, వరలక్ష్మి శరత్ కుమార్ శబరి సహా పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిపైనే భారీ భారం వేశారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.