జైలర్, జవాన్.. ఇక మనకు స్కందే దిక్కు
ఇక ఈ సీజన్ లో టాలీవుడ్ కు మిగిలిందల్లా రామ్ పోతినేని-బోయపాటి స్కంద మాత్రమే. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతుంది.
By: Tupaki Desk | 8 Sep 2023 11:30 PM GMTప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ముందు అంతా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్ ఫీవర్ నడుస్తోంది. తొలి రోజే ఊహించని రేంజ్ లో భారీ రెస్పాన్స్ ను అందుకున్న ఈ చిత్రం.. బాలీవుడ్ కు మరోసారి సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ సినిమా వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత నెలలోనూ సన్నీ దేఓల్ నటించిన గద్దర్ 2 రిలీజై భారీ వసూళ్లను అందుకుంది.
అలానే ఈ మధ్యే విడుదలైన అక్షయ్ కుమార్ ఓమై గాడ్ 2, ఆయుష్మాన్ ఖురానా డ్రీమ్ గర్ల్ 2 కూడా మంచి సక్సెస్ లను అందుకుని హిందీ పరిశ్రమలో మంచి జోష్ ను నింపాయి. అయితే ఇప్పుడు షారుక్ జవాన్ వీటన్నింటికీ మించిన భారీ విజయాన్ని అందుకుని వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన షారుక్ పఠాన్ వెయ్యి కోట్లు ఫిగర్ ను టచ్ చేయగా.. ఇప్పుడు జవాన్ కూడా అదే చేస్తుందని అంతా గట్టిగా భావిస్తున్నారు.
ఇక కోలీవుడ్ లో రీసెంట్ గా రిలీజైన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం జైలర్. ఆగస్ట్ 10న విడుదలై ఈ సినిమా లాంగ్ రన్ టైమ్ లో దాదాపు రూ.650కోట్లకు పైగా వసూళ్లను అందుకుని మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కోలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది విడుదలైన మంచి కలెక్షన్లను అందుకున్న వారిసు, పొన్నియిన్ సెల్వన్ కన్నా ఎక్కువగా జైలర్ వసూలు చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.
అలా ప్రస్తుతం ఈ సీజన్ లో బాలీవుడ్ కు జవాన్ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసే దిశగా దూసుకెళ్తుండగా, కోలీవుడ్ లో ఇప్పటికే జైలర్ ఆ మార్క్ ను సెట్ చేసేసింది. దీంతో ఇప్పుడు ఈ సీజన్ లో టాలీవుడ్ పరిస్థితేంటి అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నిజానికి మొన్నటి వరకు ఈ అనుమానాలు లేవు. ఎందుకంటే ప్రభాస్ సలార్ ఈ నెలలో విడుదలై బాక్సాఫీస్ షేక్ చేస్తుందని అంతా గట్టిగా నమ్మారు. రజనీ, షారుక్ రికార్డులు కూడా బద్దలవుతాయని భావించారు. కానీ అంచనాలు తారుమరైపోయాయి. సినిమా వాయిదా పడిపోయింది.
రీసెంట్ గా రిలీజైన ఖుషి భారీ స్థాయిలో వసూలు చేసే చిత్రం కాదు. ఇక ఈ సీజన్ లో టాలీవుడ్ కు మిగిలిందల్లా రామ్ పోతినేని-బోయపాటి స్కంద మాత్రమే. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంతోనే బోయపాటి-రామ్ తొలి సారి పాన్ ఇండియా బరిలో దిగబోతున్నారు. మరి ఈ సినిమా జైలర్, జవాన్ రేంజ్ లో కాకపోయినా మంచి వసూళ్లనే అందుకుంటుందా అన్నది ఆసక్తికరంగానూ, అనుమానంగానూ మారింది.
ఇప్పటికే అఖండతో బోయపాటి హిందీలో తన మార్క్ రుచి కాస్త చూపించారు. అలాగే రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్సే ఉంటుంది. కానీ ఇది థియేటర్లలో కాదు. మరి ఇప్పుడు స్కంద విడుదలై తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఎలాంటి ఆదరణను, వసూళ్లను అందుకుంటో చూడాలి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో .. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అయితే భారీ హైప్ ను క్రియేట్ చేయలేదు. ఈ సినిమా సెప్టెంబర్ 28న వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.