Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ '

భీష్మ తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు యువ కథానాయకుడు నితిన్. దర్శకుడిగా తొలి చిత్రం నా పేరు సూర్యతో ఎదురు దెబ్బ తిన్నాడు వక్కంతం వంశీ.

By:  Tupaki Desk   |   8 Dec 2023 7:45 AM GMT
మూవీ రివ్యూ : ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్
X

'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ' మూవీ రివ్యూ


నటీనటులు: నితిన్- శ్రీలీల- రావు రమేష్- రాజశేఖర్- సుదేవ్ నాయర్- సంపత్ రాజ్- రోహిణి- బ్రహ్మాజీ- అన్నపూర్ణ- అజయ్- హైపర్ ఆది తదితరులు

సంగీతం: హారిస్ జయరాజ్

ఛాయాగ్రహణం: ఆర్థర్ విల్సన్- యువరాజ్- సాయి శ్రీరామ్

నిర్మాతలు: సుధాకర్ రెడ్డి- నిఖిత రెడ్డి

రచన దర్శకత్వం: వక్కంతం వంశీ

భీష్మ తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు యువ కథానాయకుడు నితిన్. దర్శకుడిగా తొలి చిత్రం నా పేరు సూర్యతో ఎదురు దెబ్బ తిన్నాడు వక్కంతం వంశీ. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఈరోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలు ఏంటో చూద్దాం పదండి.

కథ:

బాలు (నితిన్) ఒక జూనియర్ ఆర్టిస్ట్. తెరమీద చిన్నాచితకా పాత్రలే చేస్తూ ఇంటా బయటా అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తనమీద తనకున్న నమ్మకంతో ఏ రోజుకైనా పెద్ద ఆర్టిస్టు అవుతానని ధీమాతో ఉంటాడు. అయితే కుటుంబ అవసరాల దృష్ట్యా అతను నటన పక్కన పెట్టి ఉద్యోగం చేస్తాడు. కాలం కలిసొచ్చి పని చేస్తున్న కంపెనీకి సీఈఓ కూడా అవబోతున్న సమయంలో బాలుకి ఒక సినిమాలో హీరోగా అవకాశం వస్తుంది. ఆ ఛాన్స్ కోసం అన్నీ వదులుకుని కష్టపడ్డ అతడికి.. డైరెక్టర్ షాక్ ఇస్తాడు. సినిమాలో అవకాశం చేజారుతుంది. ఈ స్థితిలో అతనో అనూహ్య నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి.. దాని వల్ల అతడి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం- విశ్లేషణ:

రచయితగా వక్కంతం వంశీ సక్సెస్ అయిన సినిమాలన్నీ కామెడీ ప్రధానంగా సాగినవే. పెక్యులర్ హీరో క్యారెక్టర్లతో అల్లరల్లరి చేయించి.. ప్రేక్షకులకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ డోస్ ఇచ్చి పైసా వసూల్ అనిపించేవాడు వంశీ. కానీ దర్శకుడిగా అతడి తొలి సినిమా నా పేరు సూర్య తన శైలికి పూర్తి భిన్నంగా పూర్తి సీరియస్ గా సాగింది. అది ప్రేక్షకులకు ఏమాత్రం రుచించకపోవడంతో వంశీ తన స్ట్రాంగ్ జోన్లోకి అడుగు పెట్టాడు ఈసారి. తన కొత్త చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్, ట్రైలర్ పూర్తి వినోదాత్మకంగా సాగి... ఒక ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ చూడబోతున్న కలిగించాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను మొదలుపెట్టిన వక్కంతం.. ప్రేక్షకులను ఒక ఫన్ రైడ్ కు ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపిస్తాడు. అయితే అసలు కథలోకి అడుగుపెట్టేవరకు కామెడీ సీన్లతో బాగానే టైం పాస్ చేయించిన అతను.. కథ చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారిగా చేతులు ఎత్తేసాడు. కామెడీని చేసినట్టే ఇల్లాజికల్ గా.. నాన్ సీరియస్ గా.. స్టోరీని కూడా డీల్ చేయడంతో మొత్తం వ్యవహారం చెడిపోయింది. ఒక ఒక దశ వరకు ఎక్స్ట్రార్డినరీ అని కాకపోయినా ఓకే అనిపించే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. చివరికి ఆర్డినరీగా మిగిలిపోయింది.

రచయితగా వక్కంతం వంశీకి అందులో కామెడీ అంతా ఓవర్ ద టాప్ స్టైల్లో కలర్ గా ఉంటుంది ఘన విజయాలు అందించిన కిక్, రేసుగుర్రం చిత్రాలను గమనిస్తే.. అందులో కామెడీ అంతా ఓవర్ ద టాప్ స్టైల్లో అల్లరి అల్లరి గా ఉంటుంది. కామెడీ అన్నాక ప్రేక్షకులు లాజిక్కులు పట్టించుకోరు, హడావుడే కోరుకుంటారు కాబట్టి అవి ఎలా ఉన్నా ఓకే. కానీ పై రెండు సినిమాల్లో అసలు కథ చెప్పాల్సినప్పుడు మాత్రం దాన్ని సీరియస్ గానే డీల్ చేశారు. కిక్ లో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ గా అనిపిస్తే.. హీరో విలన్ పోరులో ఇంటెన్సిటీ ఉంటుంది. కానీ ఎక్స్ట్రార్డరీ మ్యాన్ లో పరిచయం కామెడీ సీన్ల తర్వాత వచ్చే కథలో మాత్రం ఈ రెండు మిస్ అయ్యాయి. మరి ఇల్లాజికల్ గా.. వెటకారంగా అనిపించే హీరో విలన్ పోరు సీరియస్ గా తీసుకొని పరిస్థితి కల్పిస్తుంది. విలన్ పాత్రను తొలి సన్నివేశంలో అతి భయంకరుడిగా చూపించి.. కాసేపటికే జోకర్ ను చేసేయడం.. హీరో పాత్ర కూడా సిల్లీగా తయారవడంతో వాళ్ళిద్దరి ఫైట్ కామెడీగా తయారైంది.

హీరోను జూనియర్ ఆర్టిస్టుగా చూపించాలనుకోవడం మంచి ఆలోచన. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రానికి ఒక వైవిధ్యం తీసుకొచ్చింది ఈ ఆలోచనే. క్యూరియస్ గా అనిపించే హీరో పాత్రతో తొలి గంటలో వక్కంతం బాగానే ఫన్ జనరేట్ చేయగలిగాడు. ముఖ్యంగా రావు రమేష్ తనదైన టైమింగ్ తో కామెడీలో చెలరేగిపోయాడు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా సాగి ప్రేక్షకులను నవ్విస్తాయి. ఓవర్ ద టాప్ స్టైల్లో సాగే కొన్ని సన్నివేశాలు కొంచెం అతిగా అనిపించినా టైంపాస్ చేయిస్తాయి. కానీ రాను రాను కొన్ని సీన్లు శృతిమించిపోతాయి. కథానాయకతో హీరోకు ఇలా పరిచయం కావడం.. అలా ఆమె ఇంప్రెస్ అయిపోవడం.. 400 కోట్ల కంపెనీకి సీఈఓ, కథానాయకతో పెళ్లి లాంటి భారీ ఆఫర్లు తన్నుకుంటూ చేయడం సిల్లీగా అనిపిస్తాయి. ఇదే అతి అంటే ఇక విలన్ పాత్ర రంగ ప్రవేశం తర్వాత జరిగే పరిణామాలు మరీ విడ్డూరంగా ఉంటాయి. 100 మందిని ఒక బావిలో వేసి ఒకేసారి తగలబెట్టేసేంత క్రూరుడిగా విలన్ ని పరిచయం చేసి.. తర్వాతి సన్నివేశంలోనే ఆ పాత్రను తేల్చిపడేశాడు దర్శకుడు. హీరో విలన్ పోరును కొంతసేపు సీరియస్ గా కొంతసేపు మరీ కామెడీగా.. ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తాయి. జూనియర్ ఆర్టిస్టు అయిన హీరో వెళ్లి.. ఒక ప్రాంతంలో ఎస్ఐ అయిపోయి పెద్దపెద్ద రాజకీయ నాయకులను, వేలకోట్ల వ్యాపారాలను డీల్ చేసే విలన్ని ఎదుర్కొనే తీరు ఎంత మాత్రం లాజికల్ గా అనిపించదు. ద్వితీయార్థం పూర్తిగా కంగాళీగా తయారై.. ఇటు డ్రామా పండక.. అటు కామెడీ కూడా వర్కౌట్ కాక.. మరోవైపు హీరో ఎలివేషన్లు కూడా తేలిపోయి.. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నిరాశజనకంగా ముగుస్తుంది. రాజశేఖర్ క్యామియో సైతం సినిమాను కాపాడలేకపోయింది.

నటీనటులు:

భీష్మ సినిమాలో కూల్ క్యారెక్టర్లో సటిల్ గా వినోదం పంచిన నితిన్.. ఎక్స్ట్రాలో అదే స్టైల్ కంటిన్యూ చేశాడు. పెద్దగా హడావిడి చెయ్యకుండా కామెడీ పండించాడు. నితిన్ లో మంచి ఈజ్ కనిపించింది. తన లుక్స్ కూడా బావున్నాయి. శ్రీలీల క్యారెక్టర్లు, తన నటన రొటీన్ అయిపోతున్నాయి. తన పరిమితులు బయట పడిపోతున్నాయి. స్కంద, ఆదికేశవ తర్వాత మరో నామమాత్రమైన పాత్రలో ఆమె నిరాశపరిచింది. విలన్ గా సువేద్ నాయర్ పాత్రలో, నటనలో ఏ విశేషం లేదు. రావు రమేష్ తెర మీద కనిపించిన ప్రతిసారీ ఎంటర్టైన్ చేశాడు. ఆయన కామెడీ సినిమాలో పెద్ద రిలీఫ్. రోహిణి అమ్మ పాత్రలో అలవాటైన రీతిలో నటించింది. రాజశేఖర్ లేక లేక క్యారక్టర్ చేశాడు కానీ అది అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇలాంటి పాత్రతో ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా మారాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. బ్రహ్మాజీ, హైపర్ ఆది కొంత నవ్వించారు.

సాంకేతిక వర్గం:

హారిస్ జైరాజ్ అంటే పాటలు, నేపథ్య సంగీతం గురించి చాలా ఊహించుకుంటాం. కానీ ఇందులో ఆయన ముద్ర ఏమీ కనిపించదు. నేరుగా థియేటర్లో కూర్చున్నాక ఈ సినిమాకు హారిస్ సంగీతం అందించాడు అంటే నమ్మలేం. పాటలు, ఆర్ఆర్ అంత సాధారణంగా ఉన్నాయి. సినిమా విజువల్ గా బాగుంది. ముగ్గురు కెమెరామెన్ల పనితనం ఆకట్టుకుంది. నిర్మాణ విలువల విషయంలో రాజీ లేదు. ఇక రైటర్ కం డైరెక్టర్ వక్కంతం వంశీ.. స్క్రిప్ట్ విషయంలో నిరాశపరిచాడు. కామెడీ సీన్ల వరకు ఆకట్టుకున్నప్పటికీ.. అసలు కథ చెప్పాల్సినప్పుడు అతను తడబడ్డాడు. ఏమాత్రం బిగి లేకుండా ఇల్లాజికల్ గా కథను నడిపించి.. సినిమా గ్రాఫ్ ను కిందికి తీసుకెళ్లిపోయాడు. తొలి సినిమాలో మాదిరే సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అతన్ని వెంటాడింది.

చివరగా: ఎక్స్ట్రా.. ఆర్డినరీ వినోదం


రేటింగ్: 2.25/5