ఫాహద్ ఫాజిల్.. అక్కడ పుష్ప 2 క్రేజ్ కలిసొచ్చేనా?
ఈ ఏడాది ఫాహద్ ఫాజిల్ తన అద్భుతమైన నటనతో ఓ వర్గం ఆడియెన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చాడు.
By: Tupaki Desk | 10 Dec 2024 11:30 AM GMTఈ ఏడాది ఫాహద్ ఫాజిల్ తన అద్భుతమైన నటనతో ఓ వర్గం ఆడియెన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చాడు. ‘ఆవేశ్యం’, ‘బగేన్‌విలియా’ వంటి చిత్రాలతో మెప్పించిన ఫాహద్, ఇప్పుడు ‘పుష్ప 2’లో భన్వర్ సింగ్ శేఖావత్ పాత్రతో మరోసారి హైలెట్ అయ్యాడు. మొదటి భాగంలో కేవలం క్యామియోలా కనిపించిన ఫాహద్ పాత్ర, రెండో భాగంలో పూర్తి స్థాయిలో కనిపించింది. అయితే మొదటి భాగంలో ఆయన పాత్రకు ఉన్న ఫస్ట్ లుక్ పవర్ చూసి ప్రేక్షకులు రెండో భాగంలో మరింత గొప్పగా ఉంటుందని అనుకున్నారు.
అల్లు అర్జున్‌తో ఫాహద్ ఫేస్ ఆఫ్ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుందని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే, ఈ కలయిక కొంతమంది అభిమానులను నిరాశపరిచింది. ఫాహద్ పాత్రను అణగదొక్కబడినట్లు ఉందనే కామెంట్స్ వచ్చాయి. ఆ రెగ్యులర్ కోణంలో పరిమితమైందని అనిపించిందని.. అయినప్పటికీ, ఫాహద్ తన నటనతో పాత్రకు తగిన న్యాయం చేశారని మరికొందరు అంటున్నారు.
భన్వర్ సింగ్ శేఖావత్ పాత్ర ఎక్కువగా అల్లు అర్జున్ పాత్రను హీరోగా ఎలివేట్ చేయడానికి ఉపయోగించినట్లు అనిపించిందని మరికొందరి వాదన. ఫాహద్ తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించగలిగినా, ఈ పాత్రలో నటనకు అవకాశం తక్కువగా ఉండటంతో కొంతమంది అభిమానులకు అది రొటీన్ గానే అనిపించింది. అయినప్పటికీ పుష్ప 2 కలెక్షన్స్ ను అదేమీ ఇబ్బందిగా మారలేదు. వివిధ రకాల.అంశాలతో భారీ విజయాన్ని సాధించింది, రోజురోజుకీ ప్రేక్షకుల అభిరుచిని మరింతగా గెలుచుకుంటూ పోతుంది.
ముఖ్యంగా నార్త్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హిందీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే బన్నీ సరికొత్త రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ సినిమా విజయంతో ఫాహద్ మరొక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను అంగీకరించాడు. ఇమ్తియాజ్ అలీ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్’లో ట్రిప్తి డిమ్రితో కలిసి నటించబోతున్నాడు. ఇంటెన్స్ రొమాన్స్ చిత్రాల నుండి విరామం తీసుకుని ఇమ్తియాజ్ అలీ ఈ చిత్రంతో కొత్త జానర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, స్క్రిప్ట్ చివరి మెరుగులు దిద్దే దశలో ఉంది. ఫాహద్ ఫాజిల్ పుష్ప 2 క్రేజ్ ద్వారా ప్రస్తుతం మంచి ఆఫర్స్ అయితే అందుకుంటున్నారు. ఇక నటనలో కొత్త కోణాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వచ్చిన డిఫరెంట్ కంటేట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరి ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.