Begin typing your search above and press return to search.

పుష్ప విల‌న్ ఒక రోజు సంపాద‌న?

బ్లాక్ బస్టర్ 'పుష్ప' భ‌న్వ‌ర్‌సింగ్ షెకావత్ గా ప్రతినాయకుడి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించాడు ఫ‌హ‌ద్ ఫాసిల్

By:  Tupaki Desk   |   16 Jun 2024 5:45 AM GMT
పుష్ప విల‌న్ ఒక రోజు సంపాద‌న?
X

బ్లాక్ బస్టర్ 'పుష్ప' భ‌న్వ‌ర్‌సింగ్ షెకావత్ గా ప్రతినాయకుడి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించాడు ఫ‌హ‌ద్ ఫాసిల్. ఇదే కాకుండా మ‌ల‌యాళంలో అవార్డులు రివార్డులు అందుకున్న క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ల పెర్ఫామ‌ర్ గాను సుప‌రిచితుడు. అత‌డు ఇటీవ‌ల న‌టించిన‌ OTT సినిమాలు గొప్ప జ‌నాద‌ర‌ణ పొందాయి. వైవిధ్య‌మైన స్క్రిప్టు ఎంపిక‌.. ఛాలెంజింగ్ పాత్ర‌ల‌తో ఫ‌హద్ ఇప్ప‌టికే ప్ర‌యోగాలు చేసి ఆక‌ట్టుకున్నాడు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకర్షించగ‌లిగే గొప్ప ప్రతిభావంతుడు అత‌డు. అత్యంత‌ సంక్లిష్టమైన పాత్రలకు జీవం పోయగల సామర్థ్యం ఫ‌హ‌ద్ సొంతం. ఫ‌హద్ ప్ర‌తిభ‌కు మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ పరిశ్ర‌మ‌లు అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం అత‌డు పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'లో న‌టిస్తున్నాడు. పార్ట్ 1 ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో పుష్ప 2 కోసం ఫ‌హ‌ద్ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. చాలామంది టాలీవుడ్ స్టార్ల‌కు ధీటుగా ఫ‌హ‌ద్ రోజువారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. పరిశ్రమలోని అగ్రశ్రేణి న‌టుల‌కు రోజుకు 5-10 లక్షల వరకు వసూలు చేస్తుంటే ఫ‌హద్ ఫాసిల్ రేటు రోజుకు పన్నెండు లక్షలకు చేరుకుందని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అలాగే ఫీజుతో పాటు ష‌ర‌తులు కూడా వ‌ర్తిస్తాయి. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో షూటింగ్ ర‌ద్ద‌యితే, ర‌ద్ద‌యిన తేదీ పారితోషికం నుంచి 40 శాతం అద‌నంగా త‌దుప‌రి కాల్షీట్ లో వ‌సూలు చేసుకుంటున్నాడ‌ని గుస‌గుస‌. ఆ మేర‌కు అత‌డు నిర్మాత‌ల‌తో ముందే ఓ ఒప్పందం కుదుర్చుకుంటున్నాడ‌ట‌. ర‌ద్ద‌యిన షూట్ కోసం హైద‌రాబాద్ లో అడుగుపెడితే ఆరోజు పారితోషికంతో పాటు, అద‌నంగా మ‌రో 2ల‌క్ష‌లు చెల్లించాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు.

పుష్ప 2లో ఫ‌హ‌ద్ ట్రీట్ కోసం అభిమానులు చాలా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అట‌వీశాఖ అధికారి భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ వ‌ర్సెస్ పుష్ప‌రాజ్ ఎపిసోడ్స్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా నువ్వా నేనా? అంటూ సాగే ట‌గ్ ఆఫ్ వార్ ఎలా ఉంటుందో చూడాల‌న్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఈ చిత్రం

ఆలస్యం అయినప్పటికీ కొత్త విడుదల తేదీ గురించి దర్శకుడు సుకుమార్ లేదా తారాగ‌ణం నుండి అధికారిక ధృవీకరణ లేదు. దీంతో కొత్త తేదీపై ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే పుష్ప 2 ని డిసెంబర్‌లో విడుదల చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. పుష్ప 1: ది రైజ్ కూడా డిసెంబర్ 2021లో విడుదలైంది. స‌రిగ్గా మూడేళ్ల‌కు పుష్ప 2 విడుద‌ల కానుంది. అధికారిక ప్రకటన విడుద‌ల కావాల్సి ఉంది. పుష్ప2లోని రెండు పాటలు ఇప్పటికే విడుదలైన సంగ‌తి తెలిసిందే.