'పుష్ప' వల్ల నాకు వచ్చిందేమీ లేదు: ఫహద్ ఫాజిల్
ఇందులో భన్వర్ సింగ్ షేకావత్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ రోల్ లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 May 2024 11:15 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పుష్ప: ది రైజ్'. 2021 చివర్లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో భన్వర్ సింగ్ షేకావత్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ రోల్ లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన సంగతి తెలిసిందే. సినిమా చివర్లో వచ్చి 'పార్టీ కావాలా పుష్పా?' అంటూ సరికొత్త విలనిజంతో ఆకట్టుకున్నారు. ఇది టాలెంటెడ్ యాక్టర్ కు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాదు, తెలుగు ప్రేక్షకులకు ఆయన్ను బాగా దగ్గర చేసింది. అయితే 'పుష్ప' వల్ల తనకు పెద్దగా ఒరిగిందేమీ లేదని ఫాహాద్ కామెంట్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
'ఆవేశం' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో హీరో ఫహాద్ ఫాజిల్ లేటెస్టుగా ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'పుష్ప' తర్వాత మీ క్రేజ్ కేరళ బౌందరీస్ దాటిందని మీరు భావిస్తున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. 'లేదు' అని నటుడు సమాధానమిచ్చారు “అలా ఏమీ అనుకోవడం లేదు. 'పుష్ప' నా కోసం చేసిందేమీ లేదు. నేను ఇది సుకుమార్ సర్‌కి కూడా చెప్పాను. నేను దాన్ని దాచాల్సిన అవసరం లేదు. నేను చాలా నిజాయితీగా ఉండాలి. నేను ఇక్కడ నా వర్క్ చేసుకుంటున్నాను. దేన్నీ అగౌరవపర్చాల్సిన పనిలేదు. 'పుష్ప' తర్వాత జనాలు నా నుండి ఏమైనా మ్యాజిక్ ఆశిస్తున్నారా? అంటే.. లేదు. కేవలం సుకుమార్ సర్ మీదున్న ప్రేమతో నేను ఈ సినిమాతో కొలాబరేట్ అయ్యాను. నేను చాలా క్లియర్ గా ఉన్నాను. నా స్టఫ్ (మలయాళ సినిమా) ఇక్కడే ఉంది. అంతేకానీ పుష్ప నన్ను మార్చేసిందని, నన్ను డిఫరెంట్ లెవల్ కు తీసుకెళ్ళందని నేను నమ్మను” అని ఫహద్ బదులిచ్చారు.
కుంబళంగి నైట్స్, ట్రాన్స్ లాంటి మలయాళ చిత్రాలను ఇతర భాషల ప్రేక్షకులు కూడా చూస్తున్నందుకు తాను ఆశ్చర్యపోయానని ఫహద్ అన్నారు. 'పుష్ప' తనను మారుస్తుందనీ లేదా అది మరొకరి వద్దకు తీసుకెళ్తుందని తాను నమ్మనని తెలిపారు. తనను పాన్-ఇండియా స్టార్ గా పిలిపించుకోడానికి నిరాకరించిన ఫహద్.. తానొక మలయాళ నటుడిని మాత్రమే అని చెప్పారు. పాన్ ఇండియాతో లేదా మరేదైనా దానితో సంబంధం లేకుండా నేను నమ్మిన పనులు మాత్రమే చేస్తాను. సినిమా బిజినెస్ చేయాలి, మిగతాదంతా సెకండరీ. నేను ఇక్కడ చేసిన సినిమాలు మరెక్కడా చెయ్యలేను అని ఫహాద్ పేర్కొన్నారు.
'పుష్ప' అనేది ఫహాద్ ఫాజిల్ కు తెలుగు డెబ్యూ మూవీ. ఇందులో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కు పేరు వచ్చినట్లే, ఫహాద్ పోషించిన షేకావత్ పాత్రకు కూడా అదే స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ పార్ట్ లో ఆయన కనిపించేది కొద్ది నిమిషాలే అయినా, సినిమాలో ఆ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ. క్లైమాక్స్ లో భన్వర్ సింగ్ ను అవమానించి పుష్పరాజ్ పైచేయి సాధించడంతో 'పుష్ప 1' ఎండ్ అవుతుంది. దీంతో ఇప్పుడు రాబోయే 'పుష్ప 2' లో పుష్పరాజ్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి షెకావత్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఎలా ఇబ్బంది పెడతాడు? అనేది ఆసక్తిరంగా మారింది. పార్ట్ 2లో వీరిద్దరి మధ్య వార్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బన్నీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆగస్టు 15 వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే అదే రోజున 'పుష్ప: ది రూల్' సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.
ఇకపోతే ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన 'ఆవేశం' సినిమా బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించింది. జీతూ మాధవన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కేవలం రూ.30 కోట్లతో నిర్మించిన ఈ యాక్షన్ కామెడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేయడానికి రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.