విజయ్ దేవరకొండపై తప్పుడు వార్తలు.. అతను అరెస్ట్!
సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా విజయ్ ను అవమానిస్తూ కొన్ని అసత్యపు వార్తలను ప్రచారం చేశాడు.
By: Tupaki Desk | 13 Dec 2023 2:22 PM GMTటాలీవుడ్ లో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో 'అర్జున్ రెడ్డి' తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అక్కడ నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. హీరోగా ఎదుగుతున్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ ఇంతటి స్థాయికి వచ్చిన విజయ్ దేవరకొండ పై తాజాగా ఓ వ్యక్తి అసభ్యకర వార్తలను ప్రసారం చేయగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గత కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ సినిమాలకు సంబంధించి ఓ వ్యక్తి అసభ్యకర వార్తలను ప్రసారం చేశాడు. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా విజయ్ ను అవమానిస్తూ కొన్ని అసత్యపు వార్తలను ప్రచారం చేశాడు. అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి విజయ్ దేవరకొండ గౌరవాన్ని కించపరిచే విధంగా అతని సినిమాల్లోని హీరోయిన్లను అవమానిస్తూ చేసిన యూట్యూబ్ వీడియోలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీ తెలుసుకొన్నారు.
ఈ మేరకు కేసు నెంబర్ 2590/2023 గా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలని ఛానల్ ని డిలీట్ చేయించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఇతనితోపాటు సెలబ్రెటీలపై టార్గెట్ గా ఎవరు వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాల్లో వాళ్లను అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, రీసెంట్ గా 'ఖుషి' మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా సినిమాలో విజయ్ సమంత కెమిస్ట్రీ, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఇక ప్రస్తుతం గీత గోవిందం మూవీ ఫేమ్ పరశురాం దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా చేస్తున్నాడు.అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించినా షూటింగ్ ఆలస్యం వల్ల 2024 మార్చ్ కి షిఫ్ట్ చేశారు.