ఓటీటీలో సినిమా చూసి దర్శకుడికి జీ-పేలో డబ్బులు ఆఫర్!
తాజాగా ఒక సినీ ప్రేమికుడు మెయ్యజగన్ సినిమాను ఓటీటీలో చూసిన తర్వాత దర్శకుడు ప్రేమ్ కుమార్‌కి జీ పే ద్వారా డబ్బులు పంపిస్తాను అన్నాడట.
By: Tupaki Desk | 2 Jan 2025 4:56 AM GMTగత ఏడాది తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్నో చిత్రాల్లో మెయ్యజగన్ సినిమా ఒకటి. తెలుగులో ఈ సినిమాను సత్యం సుందరం టైటిల్‌తో డబ్ చేసిన విషయం తెల్సిందే. 96 చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామిలు ముఖ్య పాత్రల్లో నటించారు. భావోద్వేగాల నడము సాగిన ఈ సినిమాకు థియేటర్ రన్‌లో పెద్దగా స్పందన రాలేదు. సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి, కానీ కమర్షియల్‌గా సినిమా నిరాశ పరచింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ అంతంత మాత్రంగానే వసూళ్లు వచ్చాయి. మంచి సినిమా అంటూనే జనాలు థియటర్‌కి దూరంగా ఉన్నారు.
గతంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ నుంచి వచ్చిన 96 సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా మెయ్యజగన్ సినిమా ఉంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మనసుకు హత్తుకునే సైకిల్ సీన్స్‌తో పాటు ఎన్నో సన్నివేశాలు కదిలిస్తాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. కానీ థియేటర్‌లో ఉన్నన్ని రోజులు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే సినిమా ఓటీటీలో వచ్చిందో మంచి స్పందన దక్కించుకుంది. అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాను ఓటీటీలో చూసినందుకు, థియేటర్‌లో చూడనందుకు చాలా బాధగా ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఓటీటీలో సినిమాను విడుదల చేసిన తర్వాత థియేటర్ రిలీజ్ చూడలేక పోయామని చాలా మంది బాధ పడుతూ సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం మనం చూశాం. తాజాగా ఒక సినీ ప్రేమికుడు మెయ్యజగన్ సినిమాను ఓటీటీలో చూసిన తర్వాత దర్శకుడు ప్రేమ్ కుమార్‌కి జీ పే ద్వారా డబ్బులు పంపిస్తాను అన్నాడట. థియేటర్‌లో చూడనందుకు తాను చాలా బాధ పడుతున్నాను అని, అందుకే తాను థియేటర్‌లో చూసినట్లుగా భావించి డబ్బును తీసుకోవాలంటూ జీ పే ద్వారా డబ్బు చెల్లిస్తాను అంటూ ఆ ప్రేక్షకుడు అన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న ప్రేమ్ కుమార్ నుంచి మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలి అంటే ప్రేక్షకులు కమర్షియల్‌గా సినిమాలను ఆధరిస్తే బాగుంటుంది. మేము చూడము మంచి సినిమాలు తీయాలి అంటే ఎలా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెయ్యజగన్ సినిమాకు ఓటీటీ ద్వారా వచ్చిన పాజిటివ్ స్పందనతో దర్శకుడు ప్రేమ్ కుమార్ తన తదుపరి ప్రాజెక్ట్‌ని అంతకు మించి అన్నట్లుగా చేస్తారేమో చూడాలి. 96 కి సీక్వెల్‌ను ప్రేమ్ కుమార్ ఈ ఏడాది పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. 96 ను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కానీ సీక్వెల్‌ను రీమేక్ చేయకుండా డబ్బింగ్‌తోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.