ఫహాద్.. ఫ్యాన్స్ గోడవేంటి?
పుష్ప 2లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 11 Oct 2024 9:30 PM GMTమాలీవుడ్ లో ఫహాద్ ఫాజిల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన.. తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తన యాక్టింగ్ తో టాలీవుడ్ సినీ ప్రియులను అలరిస్తున్నారు. తెలుగులో అవకాశాలు అందుకుని దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో మెప్పించారు. నెగిటివ్ షేడ్స్ తో ఉన్న ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ రోల్ లో సందడి చేశారు.
ఇప్పుడు పుష్ప సీక్వెల్ లో కూడా ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో తక్కువ నిడివితో కూడిన క్యారెక్టర్ లో కనిపించిన ఫహాద్.. పుష్ప 2లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా ఫహాద్ నటిస్తున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయన్ మూవీలో కనిపించారు. జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. నిన్ననే థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.
ఆ మూవీలో ఫహాద్ రోల్.. ఫన్ అండ్ ఎమోషనల్ మోడ్ తో ఉంటుంది. చివరలో ఆయన రోల్ చనిపోతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫహాద్.. వేరే భాషల్లో నటించే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇతర భాషల్లో కొన్ని స్కోప్ లేని రోల్స్ లో ఆయన నటించడం కరెక్ట్ కాదని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. మాలీవుడ్ లో భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వరని.. అదే మిగతా భాషల్లో పెద్ద ఎత్తున పారితోషికాలు ఇస్తున్నందుకే ఆయన నటిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఒకప్పుడు మాలీవుడ్ యాక్టర్స్ టైగర్ ప్రభాకర్, దేవరాజ్ వంటి నటులు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్లుగా నటించారని గుర్తు చేస్తున్నారు. మళ్లీ ప్రజెంట్ జనరేషన్ నటీనటులు చాలా మంది డబ్బు కోసం ఇతర భాషల్లో నటించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి.. మలయాళ సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించి.. పెద్ద ఎత్తున వసూళ్లు సాధిస్తుంటాయి.
కానీ యాక్టర్స్ మాత్రం భారీగా రెమ్యూనరేషన్ అందుకోలేరు. అందుకే మాలీవుడ్ వాళ్లు.. వేరే లాంగ్వేజెస్ మూవీస్ లో నటించడం తప్పు లేదని చెప్పాలి. ఫహాద్.. పుష్ప సీక్వెల్ లో నటిస్తున్నందుకు రూ.ఏడు కోట్లు అందుకుంటున్నారని తెలుస్తోంది. అదే మాలీవుడ్ లో హీరోగా నటించిన సినిమాకు కూడా ఆ రీతిలో అందుకునే అవకాశం లేదు. కాబట్టి.. సినిమాల సెలక్షన్ లో ఫహాద్ తీరును ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే బెటర్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.