చెప్పుతో కొట్టాల్సింది.. 'దంగల్' నటికి నిర్మాత సలహా!
అయితే టాలీవుడ్ లో కాస్టింగ్ ఏజెంట్లు 'ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా?' అని పదే పదే రెచ్చగొట్టారని ఫాతిమా వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 3 Feb 2025 10:32 AM GMT'దంగల్' ఫేం ఫాతిమా సనా షేక్ దక్షిణాదిన తనకు కాస్టింగ్ కౌచ్ ఎదురైందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో నిర్మాతను చెప్పుతో కొట్టాల్సిందని తెలుగు నిర్మాత ముత్యాల రాందాస్ అన్నారు. కమిట్ మెంట్ అడిగిన నిర్మాతను నిలదీయాల్సిందని, చెప్పుతో కొట్టి, ఆ తర్వాత వేధింపుల నిరోధక కమిటీకి ఫిర్యాదు చేసి ఉండాల్సిందని రాందాస్ అన్నారు. తెలుగు సినీపరిశ్రమలో లైంగిక వేధింపుల అంశంలో బాధితుల తరపున కమిటీలు పని చేస్తున్నాయని కూడా ముత్యాల రాందాస్ తెలిపారు.
ఆమిర్ ఖాన్ 'దంగల్' చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్, టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫాతిమా బాలీవుడ్ బబుల్ తో మాట్లాడుతున్న ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దక్షిణాదిన నిర్మాతలు, కాస్టింగ్ ఏజెంట్లతో తన అనుభవాలను షేర్ చేసుకుంది. తాను బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందు అవకాశాల కోసం తొలిగా దక్షిణాదిన ప్రయత్నించానని, అక్కడ నటిస్తే బాలీవుడ్ లో అవకాశాలు సులువుగా వస్తాయని ఆశించానని ఫాతిమా అన్నారు.
అయితే టాలీవుడ్ లో కాస్టింగ్ ఏజెంట్లు 'ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా?' అని పదే పదే రెచ్చగొట్టారని ఫాతిమా వ్యాఖ్యానించారు. నేను కష్టపడి పనిచేస్తానని, పాత్రకు అవసరమైనది చేస్తానని వారికి చెప్పానని తెలిపింది. అయినా కాస్టింగ్ ఏజెంట్ పదే పదే అదే విషయం రిపీట్ చేసాడు. నేను మూగదానిని అయిపోయాను అని ఫాతిమా అన్నారు. హైదరాబాద్ లో పెద్ద, చిన్న నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతారని తెలిపింది.
ఏదీ డైరెక్టుగా చెప్పరు.. పరోక్షంగా చెబుతారు. ఫలానా వ్యక్తిని కలవాలి! అని అంటారు.. ఇది చేయాలి.. అది చేయాలి! అని అంటారు! అంటూ ఫాతిమా తనను వేధింపులకు గురి చేసిన వారి గురించి వెల్లడించింది. ఫాతిమా ఆరోపణలతో తెలుగు సినీపరిశ్రమ చులకన అయింది. అయితే ఇది అన్ని పరిశ్రమల్లో ఉన్నదేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఫాతిమా తదుపరి మెట్రో ఇన్ డినో చిత్రంలో నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.