40 తర్వాత మార్పులు..అందుకే కనిపించలేదా?
ఫిమేల్ సింగర్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మహిళల శరీరంలో ఈస్ట్రోజిన్ అనే హార్మోన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.
By: Tupaki Desk | 12 March 2024 12:30 AM GMTఫేమస్ సింగర్ సునీత గురించి పరిచయం అవసరం లేదు. గాయనిగా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. టెలివిజన్ షో హోస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. ఎన్నో పాటలతో తనదైన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల హృద యాల్లో స్థానం సంపాదించారు. ఎంతమంది గాయనీమణులున్నా సునీత అంటే తెలుగు ప్రేక్షకుకుల్లో ఎంతో ప్రత్యేకం. ఆ స్థానం కేవలం సునీతకు మాత్రమే అభిమానులు కల్పించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నవతరం గాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే గాయనిగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కొంత మంది గాయకులు అనూహ్యంగా తెరమరుగవుతున్నారు? మంచి మంచి పాటలతో..గాత్రంతో అల రించిన గాయకులు ఒక్కసారిగా కనుమరుగయ్యేసరికి వాళ్లంతా ఏమైపోతున్నారు? అన్న సందేహం ఉంది. తాజాగా ఇదే విషయాన్ని గాయని సునీత వద్ద ప్రస్తావించగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆవేంటో ఆమె మాటల్లోనే.. `ఎక్కడైనా మార్పు సహజంగానే వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి.
ఫిమేల్ సింగర్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మహిళల శరీరంలో ఈస్ట్రోజిన్ అనే హార్మోన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. 40 ఏళ్ల తర్వాత గాయనీమణుల శరీరంలో మార్పులు వస్తాయి. ఆ ప్రభావం గొంతుపై కూడా పడుతుంది. గొంతు డ్రై అయిపోతుంది. చిన్నప్పటి నుంచి సాధన ఉండి, ఆత్మవిశ్వాసం ఉన్న సింగర్స్ మరో పదేళ్లపాటు పాడగలుగుతారు. ఈ విషయాన్ని అంగీకరించి, ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వకపోతే సమస్యలు ఎదురుకావు. పాడటం అనేది దేవుడు కొందరికి మాత్రమే ఇచ్చిన వరం.
కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే శక్తి పాటకు ఉంటుంది. అందువల్ల దానిని సమాజహితానికి వాడుకుంటే మంచిది. కొందరిలో తపన.. టాలెంట్ ఉన్నాయి. కానీ ఓపిక లేదు. సరైన మార్గదర్శకత్వం అందించే వారు లేదు. ఇక్కడ ఎవరి జర్నీ వారిది. నాకు పాడటం వెనకున్న టెక్నిక్స్ తెలుసుకోవటానికి పదేళ్లు పట్టింది. 28 ఏళ్ల తర్వాత కూడా నేర్చుకుంటూనే ఉన్నా. అందువల్ల ఓపికగా ఉంటే అవకాశాలు లభిస్తాయి` అని అన్నారు.