Begin typing your search above and press return to search.

ఫైట‌ర్ అర్ద‌మ‌వ్వాలంటే ఫైటర్ జెట్ ట్రైనింగ్ తీసుకోవాలా?

భారతీయులు ఎయిర్ ఫోర్స్ సినిమాలను ఎందుకు అర్థం చేసుకోలేరు అనే లాజిక్ గురించి మాట్లాడాడు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 11:30 AM GMT
ఫైట‌ర్ అర్ద‌మ‌వ్వాలంటే ఫైటర్ జెట్ ట్రైనింగ్ తీసుకోవాలా?
X

బాక్సాఫీస్ వ‌ద్ద 'ఫైట‌ర్' క్రాష్ అయిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా ఓపెనింగ్స్ తోనే ఆట‌కం మొద‌లైంది. అటుపై సినిమా ఫ‌లితం కూడా అలాగే వ‌చ్చింది. తొలుత త‌రుణ్ ఆద‌ర్శ్ గొప్ప సినిమాగా అభివ‌ర్ణించినా ఆయ‌న రివ్యూ ఎక్క‌డా చెల్ల‌లేదు. దీంతో ఆయ‌న కూడా యూట‌ర్న్ తీసుకున్నాడు. వ‌సూళ్ల ప‌రంగా నెంబ‌ర్లు ఏమాత్రం స‌రిగ్గా లేవంటూ పెద‌వి విరిచేసాడు. యాక్ష‌న్ చిత్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిన సిద్దార్ధ్ ఆనంద్ అంచ‌నా మాత్రం ఈసారి త‌ప్పింది.

'వార్'..'ప‌ఠాన్' లా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని అంచ‌నా వేసినా ఈసారి ప‌ప్పులుడుక‌లేదు. రోటీన్ సినిమాగా ప్రేక్ష‌కులు తేల్చేసారు. ఇంకెంత కాలం ఈ రొటీన్ కంటెంట్ ని అందిస్తార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. హృతిక్ రోష‌న్-దీపికా ప‌దుకొణే లాంటి స్టార్ల‌తో కొత్త‌గా ప్ర‌య‌త్నించాల‌నే ఆలోచ‌న రాలేదా? అంటూ మండిప‌డుతున్నారు. ఇదే స‌మ‌యంలో సిద్దార్ధ్ ఆనంద్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు అంత‌కంత‌కు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తన ఫైటర్ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారనే దాని గురించి మాట్లాడారు.

'భారతదేశంలోని ఎంత జనాభా విమానంలో ప్రయాణించారు? 90% కంటే ఎక్కువ మంది ప్రజలు విమానంలో ప్రయాణించలేదు. అలాంటప్పుడు వైమానిక దళం నేప‌థ్యంలో నడిచే చిత్రాన్ని వారు ఎలా అర్థం చేసుకోగలరు? అందుకే మెజారిటీ ప్రజలు నా సినిమాను అర్థం చేసుకోలేకపోయారు' అని అన్నారు. దీంతో సిద్దార్ధ్ ఆనంద్ ట్రోల‌ర్ల‌కి అడ్డంగా దొరికిన‌ట్లు అయింది. ఈ వీడియోపై నెటిజన్ లు ఓ రేంజ్ ఏసుకున్నారు. తన సినిమాని ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో అతనికి అంత అవగాహన ఉన్న‌ప్పుడు అసలు అలాంటి సినిమా ఎందుకు తీసాడు? అని ప్ర‌శ్నించారు.

మరోక‌ నెటిజన్ 'ఇది బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సమస్య. వారికి అవసరమైన ఫలితం రానప్పుడు వారు ప్రేక్షకులను నిందిస్తారు. ఈ దర్శకుడు లాజిక్ లేని సినిమాలు తీస్తాడు. భారతీయులు ఎయిర్ ఫోర్స్ సినిమాలను ఎందుకు అర్థం చేసుకోలేరు అనే లాజిక్ గురించి మాట్లాడాడు.

అతని సినిమాలు చూడాలం టే ఫైటర్ జెట్ ట్రైనింగ్ తీసుకోవాలా? ఒక‌వేళ స‌బ్ మెరైన్ సినిమా ప్లాప్ అయితే ముందుగా ప్రేక్ష‌కులు స‌ముద్ర గ‌ర్భంలో తిరిగే స‌బ్ మెరైన్ లో వెళ్లాలా అంటారా? అప్పుడే ఆ సినిమాలు అర్ధ‌మ‌వుతాయా? అలాంట‌ప్పుడు 'ఘాజీ' సినిమా ఎందుకు విజ‌యం సాధించింది? ఏ కార‌ణం చేత జాతీయ అవార్డు అందుకుందో? కాస్త చెప్ప‌గ‌లరు అంటూ ఎటాకింగ్ మొద‌లైంది.