సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. ఏం మాట్లాడారంటే?
ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని.. సినీ ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలని ప్రధానంగా సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
By: Tupaki Desk | 26 Dec 2024 9:19 AM GMTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ మీటింగ్ జరిగింది. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున, వెంకటేష్, రాఘవేంద్ర రావు, సురేష్ బాబు, అల్లు అరవింద్ సహా సుమారు 50 మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి, తాజా పరిణామాల మీద చర్చించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి సహకారం ఉంటుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని.. సినీ ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలని ప్రధానంగా సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి. డ్రగ్స్ నియంత్రణపై అవగాహన, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో సినీ సెలబ్రిటీలు చొరవ చూపాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో ఇండస్ట్రీ సహకారం ఉండాలి అని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, బెనిఫిట్ షోల విషయంలో అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని, ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక సినీ పెద్దలు తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కల్పిస్తేనే తెలుగు సినీ ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని, హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ గా మారాలనేదే తమ కోరిక అని అక్కినేని నాగార్జున అన్నారు. యూనివర్సల్ లెవల్‌లో స్టూడియో సెటప్‌లు ఉండాలని అభిప్రాయ పడ్డారు. గవర్నమెంట్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అన్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండాలని.. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా చేయాలనేది తమ డ్రీమ్ అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని, ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎనిమిది సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చిందని తెలిపారు. 'పుష్ప' సినిమా ఈవెంట్ కోసం పోలీసు గ్రౌండ్ ఇచ్చామని, తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ సృష్టించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినీ రంగం కూడా తమకు ముఖ్యమని అన్నారు. ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్యవర్తిగా ఉండాలని దిల్ రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాం. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. ఇండస్ట్రీ నుంచి కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా కృషి చేస్తాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్, రానా లాంటి సూపర్ స్టార్లు మాకు గర్వకారణం అని సినీ ప్రముఖుల సమావేశంలో రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. వాళ్లంతా మా ముందు పెరిగిన వారు. వాళ్ల మీద మాకు ఎలాంటి కోపం, ద్వేషం లేదు అని అన్నారట. ఇక సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని.. ఆ మేరకు సినీ ప్రముఖులకు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి ట్విట్టర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సమావేశం అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించారని తెలిపారు.
దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం దక్కుతోంది. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని చర్చించాం. హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగే స్థాయికి వెళ్లాలని సీఎం చెప్పారు. సినీ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నంబర్ వన్ గా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం. ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినీ ఇండస్ట్రీ హబ్ గా మారుస్తాం అని దిల్ రాజు అన్నారు. సీఎం తమకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారని, అది రీచ్ అవాలని చూస్తున్నామని.. సంక్రాంతి సినిమాలు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అనేవి ఇంపార్టెంట్ కాదని.. అది చాలా చిన్న అంశమని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ఘటనపై రేవంత్ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదని మురళీమోహన్ తెలిపారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని సీఎం అన్నారని.. బెనిఫిట్ షోలు, అవార్డుల గురించి సమావేశంలో మాట్లాడడం జరిగింది అని చెప్పారు.
ఇకపోతే ముఖ్యమంత్రితో సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు పాల్గొన్నారు. నాగార్జున, వెంకటేశ్, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మురళీ మోహన్, సి. కళ్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కె.ఎల్.నారాయణ, దామోదర్, నాగవంశీ, గోపీ ఆచంట, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, నవీన్, రవిశంకర్, యూవీ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేశ్, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, వీర శంకర్, బాబీ, వేణు శ్రీరామ్, వేణు యెల్దండి, విజయేంద్రప్రసాద్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, శివ బాలాజీ తదితరులు ఈ భేటీలో ఉన్నారు.