పుష్పకు పరామర్శల వేళ... సినీ ప్రముఖులకు దిమ్మ తిరిగే డిమాండ్!
శ్రీతేజ్ వైటల్ పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని.. ట్యూబ్ ద్వారా ఇచ్చే ఆహారం బాగానే తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 16 Dec 2024 5:09 AM GMTపుష్ప బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట కేసులో జైలుకు వెళ్లి.. బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. తప్పు చేసిన జైలుకు వెళ్లి వచ్చిన బన్నీని పరామర్శించేందుకు క్యూ కడుతున్న సినీ ప్రముఖులు.. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి.. ఇప్పటికి స్ప్రహలోకి రాకుండా వెంటిలేటర్ మీద ఉన్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఎందుకు రారు? వారికి ఆ బాలుడు కనిపించడా? అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి.
నిజానికి శ్రీతేజ్.. అల్లుఅర్జున్ కు వీరాభిమాని. ఆ ఇష్టంతోనే పుష్ప2 సినిమాను మొదటి షో తప్పనిసరిగా చూడాలని మారం చేయటంతో కుటుంబం మొత్తం బెనిఫిట్ షో కు టికెట్లు తీసుకొని.. సినిమా చూసేందుకు థియేటర్ వద్దకు వెళ్లగా.. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే. తన అభిమాని తీవ్రంగా గాయపడినప్పుడు.. ఇంతకాలం పరామర్శకు వెళ్లని అల్లు అర్జున్ ఆదివారం మాత్రం కోర్టు.. కేసు కారణంగా వెళ్లలేకపోతున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు.
ఇదిలా ఉంటే.. కిమ్స్ సికింద్రాబాద్ ఆసుపత్రి వారు విడుదల చేసిన తాజా బులిటెన్ లో మరో పదిహేను రోజులు గడిస్తే తప్పించి తాము ఏమీ చెప్పలేమని స్పష్టం చేయటం గమనార్హం. జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని.. మెదడు.. నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. శ్రీతేజ్ వైటల్ పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని.. ట్యూబ్ ద్వారా ఇచ్చే ఆహారం బాగానే తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
తాజాగా శ్రీతేజ్ ను పరామర్శించేందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సిమితి జాతీయ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ ఆసుపత్రికి వచ్చారు. వైద్యులను వివరాల్ని అడిగి తీసుకున్నారు. మందక్రిష్ణతో పాటు ఆదివారం శ్రీతేజ్ ను పరామర్శించిన వారిలో రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ నేరెళ్ల శారద, తెలంగాణ మహిళా సహకార అభివ్రద్ధి సంస్థ చైర్ పర్సన్ బండ్రు శోభారాణిలు ఉన్నారు. ఈ సందర్భంగా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు వెళుతున్న సినీ ప్రముఖులు బాలుడ్ని పరామర్శించటానికి ఎందుకు రావటం లేదన్న ప్రశ్నను సంధించారు.
నిజానికి ఇదే ప్రశ్న ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక సినీ అభిమాని చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు.. అతడి పట్ల సానుభూతి.. అతడి కుటుంబం పట్ల సహానుభూతి చాలా అవసరం. మరి.. ఈ విషయంలో తెలుగు సినీ ప్రముఖులకు అలాంటి ఎమోషన్స్ ఏమీ ఉండవా? అన్నది అసలు ప్రశ్న. సినిమా మీద ఆధారపడే ప్రముఖులు.. అదే సినిమాకు వీరాభిమాని అయిన చిన్నారి తీవ్రంగా గాయపడినప్పుడు వారి కుటుంబానికి అండగా ఉంటామన్న మాట చెప్పాల్సిన అవసరం లేదు.. తాము సైతం ఎంతో వేదన చెందుతున్నామన్న సంకేతాన్ని కూడా ఇవ్వలేకపోవటం దేనికి నిదర్శనం?