TFDC ఛైర్మన్ దిల్‌రాజు ముందు బిగ్ సవాల్
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రాకు ఏపీఎఫ్‌డిసి ఏర్పడింది.
By: Tupaki Desk | 7 Dec 2024 5:10 AM GMTఆంధ్రప్రదేశ్- తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రాకు ఏపీఎఫ్‌డిసి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్.. దాని విధుల్ని నిర్వర్తిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోవడం, నిధుల కొరత.., ప్రభుత్వాల తారుమారు తకరారు అభివృద్ధిని అడుగంటేలా చేసింది. ముఖ్యంగా ఏపీలో కొత్త సినీపరిశ్రమ ఏర్పాటు గురించి చర్చ సాగినా ఎవరూ ఏమీ చేయలేకపోయారన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఏపీఎఫ్‌డిసి ఉన్నా నామమాత్రమేనన్న చర్చా సాగుతోంది.
ఇదిలా ఉండగానే ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. సినీపరిశ్రమలో దిగ్గజ నిర్మాతగా, పంపిణీదారుగా, ఎగ్జిబిటర్ గా బహుముఖంగా అనుభవం ఉన్న దిల్ రాజు తెలంగాణ సినిమా భవిష్యత్ ని నిర్ధేశిస్తారని, ప్రభుత్వానికి పరిశ్రమకు వారధిగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళతారని చర్చ సాగుతోంది.
ఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్ రాజును రెండేళ్లపాటు నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దిల్ రాజు అనుభవాన్ని, ఛరిష్మాను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేననే అభిప్రాయం ఉంది. నిజంగా ఈ అవకాశం దిల్ రాజు వంటి ప్రముఖులకు ఆయాచిత వరం లాంటిది. పరిశ్రమకు ఏం కావాలో అది అడిగి తెచ్చుకునేందుకు ఆయనకు ఒక అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఎఫ్‌డిసిని బలోపేతం చేయడం, ఎప్పటికప్పుడు సినీపరిశ్రమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం.. పరిశ్రమలో డ్రగ్స్ మహమ్మారీని రూపు మాపడం వంటి చాలా బాధ్యతలు ఇప్పుడు దిల్ రాజు ముందు ఉన్నాయి. టికెట్ రేట్ల పెంపు, పంపిణీ రంగం ఎగ్జిబిషన్ రంగంలో సమస్యల పరిష్కారానికి ఇప్పుడు మరింత అవకాశం కలుగుతుంది.
అలాగే దిల్ రాజు ముందు మరో సవాల్ కూడా ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవ్వగానే పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహా ఇనిస్టిట్యూట్ ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ప్రకటించింది తెరాస ప్రభుత్వం. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. హైదరాబాద్ లో పూణే తరహా ఫిలింఇనిస్టిట్యూట్ ప్రారంభించడం అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులకు బూస్ట్ ఇవ్వడమే. కానీ అది ప్రాక్టికల్ గా జరగలేదు. దానిని దిల్ రాజు సాధ్యం చేస్తారనే ఆశిస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ నుంచి ఆర్టిస్టులు సహా సాంకేతిక నిపుణులు పరిశ్రమలో మంచి అవకాశాల కోసం తపిస్తున్నారు. అలాంటి వారికి సహకరించే ప్రత్యేక వ్యవస్థను కూడా అతడు ఇప్పటికంటే బెటర్ గా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి రాబట్టాల్సినవన్నీ పరిశ్రమకు రాబట్టడం ద్వారా అతడు పరిశ్రమకు మేలు చేయాల్సి ఉంటుంది. అలాగే వృద్ధ కళాకారుల కోసం ప్రత్యేక ప్రభుత్వ నిధిని ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఫించను వెసులుబాటును మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.