స్పెషల్ స్టోరీ: సినిమాలకు 'సింపతీ' వర్కవుట్ అవుతుందా?
"మహేష్ బాబుతో సంక్రాంతికి తగ్గట్టుగా మేము సరెైన సినిమానే తీశాం. రకరకాల కారణాల వల్ల బ్యాక్ లాష్ వచ్చింది.
By: Tupaki Desk | 4 Nov 2024 7:29 AM GMT"మహేష్ బాబుతో సంక్రాంతికి తగ్గట్టుగా మేము సరెైన సినిమానే తీశాం. రకరకాల కారణాల వల్ల బ్యాక్ లాష్ వచ్చింది. వేరే సినిమాకి సింపతీ ఫ్యాక్టర్ తీసుకురావడానికి మా సినిమాని ఇది చేశారు.. అది చేశారు.. రకరకాలుగా జరిగాయి".. ఇవి 'గుంటూరు కారం' చిత్రం గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్. మామూలుగా ఈ 'సింపతీ' అనే మాటను మనం పాలిటిక్స్ లో ఎక్కువగా వింటుంటాం. కానీ ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలోనూ ఈ మాట తరచుగా వింటున్నాం.
లేటెస్టుగా దీపావళి స్పెషల్ గా "క" సినిమా థియేటర్లలోకి వచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. నిజానికి ఈ సినిమా ముందు వరకూ కిరణ్ కెరీర్ ఏమంత బాగాలేదు. వరుస ఫ్లాపులతో పాటుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉన్నాడు. క విడుదలకు ముందు తన ఆవేదనను మీడియా ముఖంగా వ్యక్తం చేశాడు.
క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు, సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి తలచుకొని చాలా బాధ పడ్డాడు. తన తల్లి కూలీ పని చేసి చదివించిందని, తమ కోసం కువైట్ వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదించిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన తనను అంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?, సినిమాల్లో తన గురించి డైలాగ్స్ పెట్టి ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు తనతో ప్రాబ్లం ఏంటీ? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు క సినిమా జనాలకు నచ్చకపోతే ఇంక సినిమాలు మానేస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో ఈవెంట్ కు గెస్టుగా వచ్చిన అక్కినేని నాగచైతన్య సైతం చాలా ఎమోషనల్ అయ్యారు. కట్ చేస్తే, 'క' సినిమాకు అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. కిరణ్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా మారబోతోంది. అయితే దీనంతటికీ సింపతీ ఫ్యాక్టర్ వర్కౌట్ అవ్వడమే అనే కామెంట్లు ఓ వర్గం నెటిజన్ల నుంచి వస్తున్నాయి.
ఈ ఏడాది సంక్రాంతి టైంలో 'హను-మాన్' సినిమాకి కూడా ఇలాంటి కామెంట్లే వినిపించాయి. 'గుంటూరు కారం' కారణంగా ఈ చిత్రానికి తక్కువ థియేటర్లు కేటాయించారని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు జరిగాయి. థియేటర్ల మాఫియా అని విమర్శలు చేశారు. కానీ చివరకు హనమాన్ మూవీనే విన్నర్ గా నిలిచింది. జనాలు ఈ సినిమాని విరగబడి చూశారు. కనీవినీ ఎరుగని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. అయితే ఇక్కడ చిన్న సినిమాని తొక్కేస్తున్నారనే సింపతీ జనరేట్ అవ్వడం వల్లనే అంత పెద్ద హిట్టు అయిందనే కామెంట్లు వచ్చాయి. నిర్మాత నాగవంశీ కామెంట్లు కూడా ఈ సినిమా గురించే అనే విషయం అందరికీ అర్థమవుతుంది.
రెండేళ్ల క్రితం 'కార్తికేయ 2' సినిమా విషయంలోనూ ఇలాంటి చర్చలే జరిగాయి. రిలీజ్ టైంలో హీరో నిఖిల్ సిద్ధార్థ మీడియా ముఖంగా చాలా బాధ పడ్డారు. తన సినిమాకు థియేటర్లు దొరకడం లేదంటూ ఎమోషనల్ అయ్యారు. ఇది అప్పట్లో చాలా రోజుల పాటు హాట్ టాపిక్ గా నడిచింది. చిన్న సినిమాని చంపేస్తున్నారంటూ పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. నిఖిల్ ఒక్క దెబ్బతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు. అయితే దీనంతటికీ సింపతీనే కారణమనే మాటలు బాగా వినిపించాయి.
ఇలా ఈ మూడు సందర్భాల్లోనూ సింపతీ ఫ్యాక్టర్ వర్కవుట్ అవ్వడం వల్లనే, మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయనే వాదన ఉంది. సినీ రంగం అనేది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి, ఇక్కడ కూడా సింపతీ ఉంటుందా? అనే సందేహాలు ఎవరికైనా వస్తాయి. కాకపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ సింపతీ ఫ్యాక్టర్ కారణంగానే ఇవి హిట్టయ్యాయి అనుకుంటే.. అది ఒక్క తెలుగుకే పరిమితం కావాలి. కానీ హనుమాన్, కార్తికేయ 2 చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాయి. హిందీ బెల్ట్ లో భారీ వసూళ్లు రాబట్టాయి.
నిఖిల్, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం.. ముగ్గురూ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు. కాబట్టి సపోర్ట్ చేద్దామని జనాలు అనుకొని ఉండొచ్చు. అది కూడా కేవలం మన తెలుగు వాళ్లే అనుకుంటారు.. కానీ టాలీవుడ్ హీరోలను పాన్ ఇండియా స్టార్లని చేద్దామని నార్త్ ఆడియన్స్ అనుకోరు కదా?. సినిమా బాగాలేకపోతే ఎవరూ ఏమీ చెయ్యలేరు. గతంలో మీడియా ముందు భావోద్వేగానికి గురైన చాలామంది హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఏదేమైనా కంటెంటే ఇక్కడ కింగ్. కంటెంట్ నచ్చితేనే ఆడియన్స్ దాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళతారు. పైన చెప్పుకున్న సినిమాలు హిందీలో కూడా అంత పెద్దగా ఆడుతున్నాయంటే దానికి కారణం కంటెంట్ ఒక్కటే. సో కేవలం సింపతీ ఫ్యాక్టర్ వర్కవుట్ అవ్వడం వల్లనే సినిమాలు హిట్ అవుతున్నాయని అనడం సరికాదు. 'మంచి సినిమా' తీసారు కాబట్టే, దానికి ఇతర అంశాలు యాడ్ అయ్యాయని అనుకోవాలి.. కంటెంట్ బాగుంది కనుకే ప్రేక్షకాదరణ దక్కి, సక్సెస్ సాధించారని భావించాలి.