APFTDC పదవికి వారిద్దరు పోటీనా?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇండస్ట్రీ కి అంతా మంచి జరుగుతుందని విశ్వశిస్తుంది
By: Tupaki Desk | 10 July 2024 10:43 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇండస్ట్రీ కి అంతా మంచి జరుగుతుందని విశ్వశిస్తుంది. అందుకు తగ్గట్టే అధికారంలోకి రాగానే `కల్కి 2898` టికెట్ ధరలు, అదనపు షోలు వేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది మొదటి సక్సెస్ గా చెప్పొచ్చు. ఇకపై ఏపీలోని విశాఖలో చిత్రపరిశ్రమ అభివృద్దిపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందని అంతా భావిస్తున్నారు. అలాగే షూటింగ్ అనుమతులకు, రాయితీలు వంటి అన్ని రకాల సదుపాయాలు కుటమి ప్రభుత్వంలో దొరుకుతుందని నమ్ముతున్నారు.
ఇప్పటికే సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక పోర్షన్ అయితే ఏపీ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFTDC) చైర్మన్ పదవి అన్నది అంతే కీలకమైనది. ఇప్పుడీ పదవి కోసం ఇద్దరు పోటీ పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. గతంలో ఈ పదవిని నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.
అలాగే బలమైన రాజకీయ నేపథ్యం ఉండడంతో పాటు టీడీపీలో సీనియర్ నాయకుడు కూడా. దీంతో ఆ పదవి తనకే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పట్టుబట్టారుట. ఆయన కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు మొదటి ఆప్షన్ ఆయనే అవుతారని బలంగా వినిపిస్తుంది. ఇక మరొక వ్యక్తి సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు. ఇతను మెగా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితుడు.
చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఇటీవలే రామారావు కూడా సీఎంని కలిసి మాట్లాడినట్లు సమాచారం. ఆయనతో పాటు మెగా బ్రదర్ నాగబాబును కూడా రామారావు కలిసారుట. ఆ పదవి తనకిస్తే అన్నిరకాలుగా ఇండస్ట్రీకి మంచి చేకూరలే చేస్తానని తన బాణీని వినిపించినట్లు సమాచారం. ఈ విషయంపై నాగబాబు ...డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారుట. వాస్తవానికి ఈవిషయాన్ని కొందరు పెద్దలు పవన్ తో సమావేశమైన సమయంలోనే ప్రస్తావించారని వార్తలొచ్చాయి. మరి కూటమి ప్రభుత్వం ఎవరికి ఆ పదవి కట్టబెడుతుంది? అన్నది చూడాలి.