వీరమల్లు మాట పాట వినాలి..!
ఈ నెలలోనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారనే నమ్మకంను సైతం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 4 Jan 2025 2:25 PM GMTపవన్ కళ్యాణ్ ఒక వైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నా మధ్యలో ఉన్న హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్‌ను ముగించేందుకు వీలు చిక్కినప్పుడల్లా డేట్లు ఇస్తూ వచ్చాడు. ఏదో విధంగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. మరో వారం పది రోజుల షూటింగ్ తో సినిమా పూర్తి అవుతుంది అంటూ సమాచారం అందుతోంది. సినిమాను మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు చాలా నమ్మకంగా నిర్మాతలు చెబుతున్నారు. ఈ నెలలోనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారనే నమ్మకంను సైతం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. జనవరి 6వ తారీకు ఉదయం 9 గంటల 6 నిమిషాలకు మొదటి పాట 'మాట వినాలి..' ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ పాడటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆస్కార్ అవార్డ్ గ్రహీత అయిన కీరవాణి సంగీతంలో రాబోతున్న ఈ పాటకు కచ్చితంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. సినిమా స్థాయిని పెంచే విధంగా పాట ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో మొదలైంది. కానీ సినిమా చాలా ఆలస్యం అవుతూ ఉండటంతో ఆయన తప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్‌తో పాటు చిత్ర నిర్మాతలతో సామరస్యంగా మాట్లాడుకుని తప్పుకున్నాడని తెలుస్తోంది. క్రిష్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను జ్యోతి కృష్ణ అందుకున్నారు. టైటిల్ కార్డ్ లో క్రిష్ పేరుతో పాటు జ్యోతి కృష్ణ పేరును వేస్తున్నారు. తాజాగా మాట వినాలి పాట అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లోనూ అదే విషయాన్ని చెప్పకనే చెప్పారు. దాంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ మొదటి సారి పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఇలాంటి జోనర్‌లో పవన్ ఎప్పుడూ నటించలేదు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్ కి చెందిన ముద్దుగుమ్మ ఒకరు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నారు. మొదటి పార్ట్ ను 2025 మార్చి 28న విడుదల చేయబోతుండగా, వచ్చే ఏడాదిలో రెండో పార్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాబోతున్న మొదటి సినిమా కావడంతో ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.