విదేశీ మహిళకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరణ.. వీడియో వైరల్!
అయితే ఈ వ్యవహారంపై సదరు మహిళ మాట్లాడుతూ... తాను హిందువు అని చెప్పానని, అయితే ఆలయ అధికారులు మాత్రం అందుకు సర్టిఫికెట్ సమర్పించాలని కోరారని తెలిపారు.
By: Tupaki Desk | 17 July 2024 2:44 PM GMTకేరళలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంలోకి ఓ విదేశీ మహిళను రానివ్వకపోవడంపై నెట్టింట చర్చ మొదలైంది. జాతీయత అనే అంశాన్ని కారణంగా చూపించి.. ఆమె ఆలయ ప్రవేశం చేయడాన్ని నిరాకరించారని పలువురు ఆరోపిస్తున్నాయి. తాను భారతీయుడిని వివాహం చేసుకోబోతున్నానని, త్వరలో భారతీయురాలిగా మారనున్నట్లు ఆమె చెప్పినా అనుమతించలేదని అంటున్నారు.
అయితే... ఆలయాల్లో ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వడం కంపల్సరీ అని.. ఈ విషయంలో చిన్న పెద్దా, స్వదేశీ విదేశీ అనే తారతమ్యాలేమీ ఉండవనేది ఆలయ పెద్దల నుంచి వస్తోన్న వివరణగా ఉందని అంటున్నారు. దీన్ని మరోలా చూడకుండా... ఆలయ నిబంధనగా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారని తెలుస్తోంది.
అయితే ఈ వ్యవహారంపై సదరు మహిళ మాట్లాడుతూ... తాను హిందువు అని చెప్పానని, అయితే ఆలయ అధికారులు మాత్రం అందుకు సర్టిఫికెట్ సమర్పించాలని కోరారని తెలిపారు. హర్ ప్రీత్ అనే నెటిజన్ ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. సాంప్రదాయబద్ధంగా చీరకట్టుకుని ఉన్న విదేశీ మహిళను ఆలయంలోకి అనుమతించలేదని ఈ వీడియోలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు కార్తీ చిదంబరం స్పందించారు. ఈ సందర్భంగా ఎవరినైనా.. తాము పూజించకుండా ఎందుకు నిరోధించాలని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా... ఆమె విదేశీయురాలైనా.. భారతీయుడు, హిందువు అయిన కాబోయే భర్తతో సందర్శించాలనుకున్నప్పుడు అనుమతి ఇవ్వాల్సిందని కొంతమంది అంటున్నారు.
అయితే.. హిందూ దేవాలయాలు పర్యాటక ప్రదేశాలు కావని.. కొన్ని ఆలయాలకంటూ ఉన్న నిబంధనలను ఎవరైనా సరే పాటించాల్సిందే అని.. డిక్లరేషన్ ను సమర్పించలేనందుకే ఆమెకు అనుమతి నిరాకరించి ఉంటారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రముఖ గాయకుడు జేసుదాస్ అఫిడవిట్ సమర్పించిన తర్వాతే శ్రీపద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.