రేపే విడుదల... సంక్రాంతి సినిమాల పై ప్రభావం ఎంత?
గాంధీ తాత చెట్టు కాకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు రేపు చాలా సినిమాలే రాబోతున్నాయి. అందులో కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 23 Jan 2025 10:57 AM GMTతెలుగు ప్రేక్షకుల ముందుకు ప్రతి వారం మాదిరిగానే ఈ శుక్రవారం అంటే రేపు పలు సినిమాలు విడుదల కాబోతున్నాయి. పెద్ద సినిమా విడుదల ఉంటే చిన్న సినిమాలన్నీ సైడ్ అవుతాయి. పెద్ద సినిమాలు లేవు కనుక చిన్న సినిమాలు చాలానే ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా సుకుమార్ కూతురు నటించిన గాంధీ తాత చెట్టును చెప్పుకోవచ్చు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా రూపొందిన గాంధీ తాత చెట్టును ఇప్పటికే పలు అవార్డులు రివార్డులు వరించాయి. మంచి నటనతో సుకృతి అలరించిందని ఇప్పటికే చూసిన వారు అంటున్నారు. కమర్షియల్‌గా గాంధీ తాత చెట్టు ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తుంది అనేది చూడాలి.
గాంధీ తాత చెట్టు కాకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు రేపు చాలా సినిమాలే రాబోతున్నాయి. అందులో కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. టోవినో థామస్, త్రిష జంటగా నటించిన ఐడెంటిటీ సినిమాను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా తెలుగులో డబ్ చేశారు. త్రిషకి ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో తెలుగు లో సినిమా ఎంత వరకు ఆడుతుంది అనేది చూడాలి. ఇక ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మమిత బైజు నటించిన డియర్ కృష్ణ సినిమా సైతం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలం అయ్యారు.
బాలీవుడ్ మూవీ స్కై ఫోర్స్ సైతం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు లో డబ్ చేయకున్నా ప్రేక్షకుల్లో ఉన్న అక్షయ్ కుమార్ అభిమానులు స్కై ఫోర్స్‌ను చూడ్డానికి ఆసక్తిగా ఉన్నారు. తల్లి మనసుతో పాటు హత్య సినిమాను సైతం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఏ సినిమాకు వావ్ అనిపించేంత బజ్ క్రియేట్ కాలేదు. రేపు విడుదల అయిన తర్వాత ఏమైనా పాజిటివ్ టాక్ వస్తే అప్పుడు ప్రేక్షకులు ఆ సినిమాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలా పాజిటివ్ టాక్ దక్కించుకోగల సత్తా ఉన్న సినిమా ఏమైనా ఉందా అంటే అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సందడి చేస్తున్నాయి. రెండో వారంలోనూ సినిమా కచ్చితంగా భారీ వసూళ్లు సొంతం చేసుకుంటుంది అని సంక్రాంతికి వస్తున్నాంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు రూ.230 కోట్ల వసూళ్లు రాబట్టిన ఆ సినిమా రేపు విడుదల కాబోతున్న సినిమాలు పెద్దగా ప్రభావం చూపించకుంటే ఈజీగా రూ.300 కోట్ల మార్క్‌ని చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ వరకు డాకు మహారాజ్ సినిమా వసూళ్లు బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపు విడుదల కాబోతున్న సినిమాలు సంక్రాంతి సినిమాలపై ఎంత వరకు ప్రభావం చూపిస్తాయి అనేది ఆసక్తిగా మారింది.