మాదకద్రవ్యాలకు బానిసైన నటుడు చివరికిలా
అతడు ప్రతిభావంతుడైన నటుడు. తన నటన కామిక్ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించగలడు.
By: Tupaki Desk | 29 Oct 2023 5:56 AM GMTఅతడు ప్రతిభావంతుడైన నటుడు. తన నటన కామిక్ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించగలడు. ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించగలడు. అజేయమైన కెరీర్ ని సాగిస్తున్నాడు. కానీ ఇంతలోనే అకాలమరణం చెందాడు. దీనికి కారణం అతడు మత్తుకు బానిసవ్వడమే. మాదకద్రవ్యాల భారిన పడి అతడు పూర్తిగా అనారోగ్యంతో పోరాడాల్సిన దుస్థితికి దిగజారాడు. అంతిమంగా యముడు తనను పరలోకానికి మోసుకెళ్లాడు. ఇంతకీ ఎవరా నటుడు? అంటే.. అతడి పేరు మాథ్యూ పెర్రీ. హాలీవుడ్ టీవీ నటుడు.
మాథ్యూ పెర్రీ పాపులర్ టీవీ సిరీస్ `ఫ్రెండ్స్`లో చాండ్లర్ బింగ్‌గా తన ఐకానిక్ పాత్రతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. 54 సంవత్సరాల వయస్సులో అతడు విషాదకరంగా మరణించాడు. లాస్ ఏంజెల్స్ నివాసంలో జరిగిన ఓ ప్రమాదంలో అతడు అకాల మరణం పాలయ్యాడు. అతడు డ్రౌనింగ్ (మునక) యాక్సిడెంట్ లో మృతి చెందాడని నివేదికలు అందాయి. అయితే ఈ ఘటనలో అనుమానించాల్సిన ఫౌల్ ప్లే ఏదీ లేదని పోలీసులు దర్యాప్తులో నివేదించారు.
ఫ్రెండ్స్ లో మాథ్యూ పెర్రీ చాండ్లర్ బింగ్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ పెర్ఫామెన్స్ వినోద పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది. అతడి హాస్యానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. అతడికి 2002లో ఎమ్మీ నామినేషన్ సహా అనేక అవార్డు ప్రతిపాదనలు వచ్చాయి.
కెరీర్ పరంగా విజయం ఉన్నా కానీ, పెర్రీ బహిరంగంగా వ్యసనంతో పోరాడాడు. ``ఫ్రెండ్స్, లవర్స్, అండ్ ది బిగ్ టెరిబుల్ థింగ్: ఎ మెమోయిర్``లో వివరించినట్లు ఇది మాదకద్రవ్యాల వ్యసనంతో వచ్చిన ముప్పు. ఈ పుస్తకంలో అతడి వ్యసనాలు, పోరాటాలపై ఎన్నో విషయాలు రాసారు.
అతడి ఆకస్మిక మరణం వినోద పరిశ్రమకు తీరని లోటు అని అభిమానులు, స్నేహితులు, సహోద్యోగులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మాథ్యూ పెర్రీని కోల్పోయినందుకు పలువురు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఆర్టిస్టుల సంఘం నుండి నివాళులు అర్పించారు. ఫ్రెండ్స్ TV కార్యక్రమం అధికారిక ఇన్ స్టాలో హృదయపూర్వక నివాళిని పోస్ట్ చేసారు. తోటి నటులు మరియు స్నేహితులు అతడిని పరిశ్రమలో ప్రతిభావంతుడైన మంచి వ్యక్తిగా గుర్తు చేసుకున్నారు. మాదకద్రవ్యాలు నేడు యువతరాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ డ్రగ్స్ మత్తు ప్రమాదకరంగా పరిణమించిందని ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి.