గామి బాక్సాఫీస్.. రెండో రోజు విశ్వక్ వీర కుమ్ముడు
భారీ ఓపెనింగ్స్ సాధించిన గామి మూవీ.. రెండో రోజు కూడా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. రెండు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా రూ.15.1 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
By: Tupaki Desk | 10 March 2024 6:35 AM GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో సత్తా చాటుతున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. హీరోగా నటిస్తూ దర్శక నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరోగా అలరిస్తున్నారు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహాశివరాత్రి కానుకగా ఈ మూవీ మార్చి 8వ తేదీన విడుదలైంది.
డైరెక్టర్ విద్యాధర్ కాగిత ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి గామి సినిమాను తెరకెక్కించారు. ఆరేళ్లపాటు షూటింగ్ జరిగిన ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించగా.. అభినయ లీడ్ రోల్ పోషించింది. అడ్వెంచరెస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మానవ స్పర్శ తట్టుకోలేని అఘోర పాత్రలో నటించి అదరగొట్టారు విశ్వక్. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుందీ మూవీ. ఫలితంగా మంచి వసూళ్లు రాబడుతోంది.
భారీ ఓపెనింగ్స్ సాధించిన గామి మూవీ.. రెండో రోజు కూడా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. రెండు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా రూ.15.1 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గామి సినిమా వీకెండ్ లో కూడా తన స్టామినా చూపించడం పక్కా అని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఏలో గామి.. అతి త్వరలోనే హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంటుందని చెబుతున్నారు.
మరోవైపు, ఈ సినిమాలో విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని ఫ్యాన్స్ పాజిటివ్ గా రియక్ట్ అవుతున్నారు. తెలుగు చిత్రాల్లో ఇప్పటి వరకు ఇలాంటి విజువల్స్ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. కొన్ని సీన్లు అయితే హాలీవుడ్ స్టైల్ లో ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. విశ్వక్ ప్రయోగానికి హ్యాట్సాఫ్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కొత్త డైరెక్టర్ అయినా సినిమా టేకింగ్ లో వావ్ అనిపించారని అంటున్నారు.
విద్యాధర్ తెరకెక్కించిన ఈ మూవీని వి సెల్యూలాయిడ్ సమర్పణలో క్రౌడ్ ఫండింగ్ తో కార్తీక్ శబరీష్ నిర్మించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అభినయతోపాటు మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక, శాంతి రావు కీలక పాత్రలు పోషించారు. విశ్వక్ సేన్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలవనున్న ఈ మూవీ ఎలాంటి లాభాలు సంపాదిస్తుందో చూడాలి.