8వ నెల గర్భం.. మెదడులో గడ్డకట్టిందని తెలిస్తే.. నటి అంతర్మథనం!
30 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 1,00,000 మంది గర్భిణీ స్త్రీలలో ముగ్గురికి సివిటి (మెదడులో రక్తం గడ్డకట్టడం) ఉన్నట్లు నిర్ధారణ అవుతోందని నాకు తెలియదు అని కూడా గాల్ వెల్లడించారు.
By: Tupaki Desk | 30 Dec 2024 2:33 PM GMTసెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చాలా అనారోగ్య సవాళ్ల గురించి తమ అభిమానులు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు మయోసైటిస్ గురించి అవగాహన పెంచేందుకు సమంత సోషల్ మీడియాల్లో అద్భుతమైన సమాచారాన్ని ప్రజలకు అందించారు. డిప్రెషన్ తో సవాళ్లు చిక్కుల గురించి దీపిక పదుకొనే, అమీర్ ఖాన్ కుమార్తె ఇరాఖాన్ వంటి వారు సోషల్ మీడియాల్లో చాలా సంగతులు చెప్పారు. ఇప్పుడు వండర్ ఉమెన్ గాల్ గోడోట్ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ కఠినమైన పరిస్థితి గురించి ప్రజలకు చెప్పారు.
మార్చిలో తన నాల్గవ కుమార్తె ఓరిని స్వాగతించిన హాలీవుడ్ నటి గాల్ గాడోట్ ఎనిమిదవ నెలలో గర్భం దాల్చిన సమయంలో తన మెదడులో భారీగా రక్తం గడ్డకట్టినట్లు వెల్లడించింది. తన ఇన్ స్టాలో సుదీర్ఘ నోట్ ద్వారా చాలా విషయాలను అర్థమయ్యేలా చెప్పింది. చికిత్స చేయదగిన CVT (మెదడులో రక్తం గడ్డకట్టడం) గురించి అవగాహన కల్పించడానికి అభిమానులు, ఇన్ స్టా ఫాలోవర్స్ తో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి షేర్ చేసింది. తన కుమార్తెకు ఓరి (నా కాంతి) అని పేరు పెట్టడానికి కారణం.. ప్రసూతి కష్ఠంలో శిషువు జన్మించడమేనని అన్నారు.
గాల్ గాడోట్ ఆసుపత్రి బెడ్ పై కుమార్తెతో ఉన్నప్పటి ఒక ఫోటోని షేర్ చేసింది. ఒక చేత్తో బ్లాక్ కాఫీ గ్లాసును పట్టుకుని శిషువు వైపు ఆసక్తిగా చూస్తోంది. అమ్మతనంలోని ప్రేమానురాగాలు ఆ చూపుల్లో కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం లోతైన సవాళ్లు ఘాడమైన ప్రతిబింబాలతో కూడుకున్నదని, ప్రసూతి సమయంలో తాను అనుభవించిన బాధ, కష్టాలు అసాధారణమైనవని గాల్ ఈ నోట్ లో రాసారు. ఫిబ్రవరిలో నా ఎనిమిదవ నెల గర్భం.. నా మెదడులో భారీగా రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారణ అయింది. వారాలపాటు నేను మంచానికి పరిమితమై విపరీతమైన తలనొప్పిని భరించాను. చివరకు ఎం.ఆర్.ఐ చేయించుకున్న తర్వాత భయంకరమైన నిజం తెలిసింది. ఒక క్షణంలో నా కుటుంబం, నేను జీవితం ఎంత కఠినంగా ఉంటుందో చూశాం. ఇది ఎంత త్వరగా మారుతుందోనని వేచి చూసిన సంవత్సరం అని గాల్ అన్నారు. ఆసుపత్రికి చేరుకున్న కొన్ని గంటల్లో అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నాను. నా కుమార్తె ఓరి, అనిశ్చితి భయం నడుమ జన్మించింది. అందుకే తన పేరు-ఓరి. హిబ్రూ బాషలో 'నా కాంతి' అని అర్ధం. ఈ పేరును అనుకోకుండా ఎంపిక చేయలేదని గాల్ తెలిపారు.
సర్జరీకి ముందు.. నా చిన్నారి పుట్టుకకు ముందు కొన్ని వారాల పాటు వైద్యుల శ్రమతో ఇదంతా సాధ్యమైంది. వైద్యుల అంకితభావంతో నేను పూర్తిగా కోలుకున్నాను. నాకు జీవితాన్ని తిరిగి ఇచ్చినందుకు కృతజ్ఞతతో నిండిపోయాను.. అని ఎమోషనల్ గా రాసారు. ఈ ప్రయాణం నాకు చాలా నేర్పింది. ముందుగా మన శరీరం చెప్పేది వినడం, విశ్వసించడం చాలా ముఖ్యం. నొప్పి, అసౌకర్యం లేదా సూక్ష్మమైన మార్పులు తరచుగా లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. మీ శరీరానికి కలిగే సమస్యను ఇవన్నీ బయటపెట్టొచ్చు'' అని రాసారు.
30 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 1,00,000 మంది గర్భిణీ స్త్రీలలో ముగ్గురికి సివిటి (మెదడులో రక్తం గడ్డకట్టడం) ఉన్నట్లు నిర్ధారణ అవుతోందని నాకు తెలియదు అని కూడా గాల్ వెల్లడించారు. ఇది చికిత్స చేయదగిన సమస్య కాబట్టి ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ఇలాంటిది ఉనికిలో ఉందని తెలుసుకోవడం దానిని పరిష్కరించడానికి మొదటి అడుగు. దీన్ని షేర్ చేయడం ఎవరినీ భయపెట్టడానికి కాదు..అందరూ తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం'' అని తెలిపారు గాల్.
2008లో జారోన్ వర్సనోని వివాహం చేసుకున్న గాల్ గాడోట్ 2011లో అల్మా, 2017లో మాయ, 2021లో డానియెల్లా అనే ముగ్గురు కుమార్తెలను స్వాగతించారు. ఇప్పుడు నాలుగో బిడ్డ ఓరీకి జన్మనిచ్చారు. గాల్ గాడోట్ చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ హార్ట్ ఆఫ్ స్టోన్ (2023)లో రాచెల్ స్టోన్‌గా కనిపించింది. ఇందులో ఆలియా భట్ ఓ కీలక పాత్రను పోషించగా, గర్భంతోనే ఆలియా సెట్స్ పైకి వెళ్లింది.
https://www.instagram.com/p/DELT6PMPmHs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==