గేమ్ చేంజర్ పైరసీ కలకలం.. లీక్ అయ్యింది అక్కడి నుంచేనా?
ఇక లేటెస్ట్ గా మరింత క్వాలిటీ ప్రింట్ లీక్ అవ్వడం మేకర్స్‌కు తలనొప్పిగా మారింది.
By: Tupaki Desk | 24 Jan 2025 3:55 PM GMTసంక్రాంతి సీజన్‌లో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గేమ్ చేంజర్’ సినిమా ఇంకా థియేటర్‌లు పూర్తి రన్‌లో ఉండగానే మరోసారి పైరసీ బారిన పడటం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. విడుదల రోజు నుంచి పైరసీ సమస్యలు వెంటాడుతున్నాయి. విడుదలైన మరుసటిరోజే 4K ప్రింట్ లీక్ అవ్వడం అందరిని షాక్ కు గురి చేసింది. మేకర్స్ కూడా సైబర్ క్రైమ్ ను సంప్రదించాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్ గా మరింత క్వాలిటీ ప్రింట్ లీక్ అవ్వడం మేకర్స్‌కు తలనొప్పిగా మారింది.
సినిమా వసూళ్లను దెబ్బతీసే ఈ ఘటనపై చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. లేటెస్ట్ గా లీక్ అయిన ప్రింట్ గురించి పరిశీలిస్తే, తమిళ, హిందీ వెర్షన్‌లతో పాటు అత్యంత నాణ్యమైన క్వాలిటీని కలిగి ఉంది. ఓటీటీలో రిలీజ్ చేసే నాణ్యతతో ఈ ప్రింట్ బయటకు రావడం గమనార్హం. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
పైరసీకి సంబంధించిన పలు ఆధారాలు నెటిజన్లు తెరపైకి తీసుకురావడం, ఈ లీక్ ఎడిట్ రూమ్ నుంచే జరిగినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వెర్షన్‌లో అనేక సన్నివేశాలు పూర్తిగా సీజీ చేయకపోవడం, డబ్బింగ్ పూర్తిగా చేయని సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇది చూసిన వారంతా ఈ లీక్ ఎడిట్ దశలో ఉన్న సినిమాను ఎవరో బయటకు విడుదల చేసినట్లు స్పష్టమవుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటన చిత్ర యూనిట్‌లో భాగమైన వాళ్లలోనే ఎవరో చేయించి ఉంటారనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. గతంలోనూ తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరగడం గమనార్హం. ‘గేమ్ చేంజర్’ లీక్ ఘటన గతంలో జరిగిన కొన్ని పెద్ద లీక్ సంఘటనలను తలపిస్తోంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందే లీక్ అవ్వడం అప్పట్లో సంచలనం రేపింది.
ఆ లీక్ వెనుక చిత్ర బృందంలో పని చేసిన వాళ్ల ప్రమేయం ఉండటం మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ విషయంలోనూ అదే తరహా చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన ఈ లీక్ కారణంగా సినిమా కలెక్షన్లపై ఎంతమాత్రం ప్రభావం పడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. పైరసీ సమస్యతో భారీ బడ్జెట్ సినిమాలు తరచుగా ఎదుర్కొంటున్నా, వాటిని నిరోధించేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని పరిశ్రమ పెద్దలు అంటున్నారు. అటు మెగా అభిమానులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.