గేమ్ ఛేంజర్.. గంటలోనే కోటి!
ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
By: Tupaki Desk | 9 Jan 2025 9:19 AM GMTసంక్రాంతి పండుగకు టాలీవుడ్ ప్రేక్షకులకు రామ్ చరణ్ నుంచి ఓ పవర్ఫుల్ ట్రీట్ అందనుందని అర్ధమవుతుంది. మెగాస్టార్ వారసుడిగా చరణ్ కెరీర్‌లో కొత్త రికార్డు సృష్టించడానికి గేమ్ ఛేంజర్ సినిమా సిద్ధమైంది. ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గేమ్ ఛేంజర్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతుంది.
ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి లీడ్ రోల్స్ పోషించారు. థమన్ సంగీతం, ఎస్ జె సూర్య నటన ఈ చిత్రానికి ప్రధాన బలాలు. ఇక సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఇప్పటికే భారీ ప్రమోషన్స్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్లతో పాటు రామ్ చరణ్ అన్ స్టాపబుల్ ఇంటర్వ్యూ సినిమా మీద హైప్‌ను రెట్టింపు చేశాయి. గేమ్ ఛేంజర్ సాంగ్స్, టీజర్, ట్రైలర్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సినిమా కంటెంట్ పట్ల ఆసక్తి కలిగించడంలో ఈ ప్రమోషన్ల హస్తం ఉందని చెప్పాలి. అంతేకాకుండా, మెగా ఫ్యాన్స్‌తో పాటు ఇతర అభిమానులు కూడా ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ప్రత్యేకంగా నైజాం ఏరియాలో అర్ధరాత్రి సమయంలో ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో హౌస్ ఫుల్ అయ్యాయి.
హైదరాబాద్ లో పలు మల్టీప్లెక్సుల్లో తొలి రోజుకు పూర్తిగా ఫుల్ అవ్వడం విశేషం. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన గంటలోనే ఈ చిత్రం నైజాం ఏరియాలో కోటి గ్రాస్‌ను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బుకింగ్స్ లేటుగా ప్రారంభమైనప్పటికీ, ఈ ర్యాంపేజ్ చూస్తే సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అనిపిస్తుంది.
ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే, గేమ్ ఛేంజర్ వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ. 220 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 130 కోట్ల బిజినెస్ జరగగా, నైజాం ఏరియాలోనే ఈ చిత్రం భారీగా రూ. 40 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం గమనార్హం. దీనితో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవాలంటే కనీసం రూ. 400 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది.
శంకర్ మార్క్ భారీ యాక్షన్ సీన్లు, సెంటిమెంట్ తో కూడిన కథనం ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్లస్ అవుతాయని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, సంక్రాంతి రేసులో గేమ్ ఛేంజర్ తనదైన ముద్ర వేయడం ఖాయమని అంటున్నారు. చరణ్, శంకర్ కాంబినేషన్ ప్రేక్షకులకు మరో బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోంది. ఇక మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.