'గేమ్ ఛేంజర్' హిందీ బాక్సాఫీస్ పరిస్థితి
తెలుగు, తమిళ వెర్షన్ల కంటే హిందీ వెర్షన్ ఉత్తమ వసూళ్లను సాధిస్తోందని కథనాలొచ్చినా ఇది లాంగ్ రన్ లో నిలబడలేదని తెలుస్తోంది.
By: Tupaki Desk | 16 Jan 2025 5:52 AM GMTరామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన 'గేమ్ ఛేంజర్' మిశ్రమ స్పందనల నడుమ ఆశించిన మైలేజ్ ని అందుకోలేకపోయింది. తెలుగు, తమిళ వెర్షన్ల కంటే హిందీ వెర్షన్ ఉత్తమ వసూళ్లను సాధిస్తోందని కథనాలొచ్చినా ఇది లాంగ్ రన్ లో నిలబడలేదని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడంలో ఇబ్బంది పడుతోంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు, ప్రతికూల సమీక్షలు ఇబ్బందికరంగా మారాయి. రిలీజ్ మొదటి రోజే హెచ్‌డి ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకవ్వడం కలకలం రేపింది. రకరకాల కారణాలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా ఆడలేదు.
ముఖ్యంగా సంక్రాంతి సెలవుల్లో బాక్సాఫీస్ వద్ద రాణిస్తుందని భావించినా, ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ చెబుతోంది. హిందీ వెర్షన్ మొదటి వారాంతంలో మంచి వసూళ్లను సాధించింది. తొలి మూడురోజుల్లో దాదాపు రూ. 27 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఈ గౌరవనీయమైన సంఖ్యలతో ఉత్తరాదిన దీర్ఘకాలం థియేటర్లలో ఆడుతుందని అభిమానులు ఆశించారు. కానీ హిందీ వెర్షన్ కూడా మొదటి సోమవారం డౌన్ ఫాల్ అయిందని జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.
సోమవారం నాడు గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్ కేవలం రూ. 2.42 కోట్ల నికర వసూళ్లను మాత్రమే సాధించింది. మకర సంక్రాంతి కారణంగా మంగళవారం సెలవు దినం అయినా కానీ హిందీ డబ్బింగ్ వెర్షన్ లో వృద్ధి కనిపించలేదు. దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీగా రూపొందించిన ఈ చిత్రం అంతిమ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. గేమ్ ఛేంజర్ మొదటి 6 రోజుల్లో 112 కోట్లు వసూలు చేసిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో పేర్కొంది. అయితే గేమ్ ఛేంజర్ మొదటి రోజు రూ.186 కోట్లు వసూలు చేసిందని అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొనడాన్ని ఫేక్ అంటూ విమర్శించిన సంగతి విధితమే.