గేమ్ చేంజర్.. బాలీవుడ్ లో మొదలైన చిల్లర లొల్లి..
అడ్వాన్స్ గా నెగెటివిటీ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. హిందీ మీడియా, సోషల్ మీడియాల్లో వరుసగా సినిమా ట్రైలర్ పట్ల తక్కువ భావన కలిగించే వ్యాఖ్యలు రావడం గమనార్హం.
By: Tupaki Desk | 9 Jan 2025 5:30 PM GMTతెలుగు రాష్ట్రాల్లో రాబోయే పెద్ద సినిమాల బిజినెస్ పై పుష్ప 2 ప్రభావం ఎంతగా పడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంధ్య థియేటర్ ఘటన కారణంగా భవిష్యత్తు సినిమాలకు నైజాం గడ్డపై ఊహించని ఇబ్బందులు తలెత్తాయి. బాలీవుడ్ లో కూడా గేమ్ ఛేంజర్ కు పలు ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ప్రభంజనం 'బాహుబలి: ది బిగినింగ్'తో మొదలైంది.
అప్పటికి బాలీవుడ్, సౌత్ సినిమాల మధ్య అంత పెద్ద తేడా లేదనిపించింది. కానీ బాహుబలి విజయం తర్వాత సౌత్ సినిమాలు ఏ రేంజ్‌లో విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే. 'బాహుబలి-2, 'కేజీఎఫ్' 'ఆర్ఆర్ఆర్' 'పుష్ప' వంటి సినిమాలు బాలీవుడ్ వసూళ్లను బద్ధలుకొట్టి, హిందీ ప్రేక్షకులను సైతం ఆకర్షించాయి. ఇటీవల విడుదలైన 'పుష్ప-2' రికార్డు స్థాయి వసూళ్లను సాధించి బాలీవుడ్ ప్రేక్షకుల్ని షాక్‌కు గురిచేసింది.
ఈ విజయానికి తోడు టాలీవుడ్ నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ప్రాముఖ్యాన్ని మరింత తగ్గించాయి. బాలీవుడ్ సౌత్ సినిమాల ముందు తేలిపోతోందని, ఇంతకుముందు ఉన్న స్థాయిని నిలబెట్టుకోవడం కూడా కష్టమని చెప్పడం బాలీవుడ్ జనాల గుండెల్లో గుబులు పుట్టించింది. ఈ పరిస్థితుల మధ్య 'గేమ్ చేంజర్' పాన్ ఇండియా సినిమా రాబోతోంది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, బాలీవుడ్ వర్గాలు ఈ సినిమాపై రిలీజ్ కు ముందే చిల్లర లొల్లి స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ గా నెగెటివిటీ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. హిందీ మీడియా, సోషల్ మీడియాల్లో వరుసగా సినిమా ట్రైలర్ పట్ల తక్కువ భావన కలిగించే వ్యాఖ్యలు రావడం గమనార్హం. 'గేమ్ చేంజర్'కి ఉత్తర భారతదేశంలో మంచి బజ్ లేదని, బిజినెస్ జరగలేదని, అడ్వాన్స్ బుకింగ్స్ నిరాశాజనకంగా ఉన్నాయని ఓ వర్గం హిందీ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
పుష్ప-2 విజయాన్ని జీర్ణించుకోలేని బాలీవుడ్ జనాలు, ఈ సినిమాపై అసత్య కథనాలను గుప్పిస్తూ నెగెటివిటీని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని క్లియర్ గా అర్ధమవుతుందని ఫ్యాన్స్ కూడా కౌంటర్లు ఇస్తున్నారు. సౌత్ సినిమాల విజయాల ధాటికి తట్టుకోలేని బాలీవుడ్ ఇప్పుడు 'గేమ్ చేంజర్'ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'గేమ్ చేంజర్' టీమ్ నెగెటివ్ ప్రచారానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సినిమా విడుదల తర్వాత రివ్యూల ద్వారా కూడా నెగెటివిటీని ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి. ఇక సౌత్ నుంచి వచ్చిన పాన్ ఇండియా చిత్రాలు నెగెటివిటీని దాటి విజయాలు సాధించిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. 'గేమ్ చేంజర్' కూడా ఈ నెగటివిటీని అధిగమించి, పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధిస్తే, అది టాలీవుడ్ టాప్ సినిమాల జాబితాలో స్థానం సంపాదించుకుంటుంది.