Begin typing your search above and press return to search.

సంక్రాంతి బిగ్ రికార్డ్.. గేమ్ ఛేంజర్ కొట్టగలదా?

సినిమా కంటెంట్‌, శంకర్ మేకింగ్ స్టైల్, థమన్ సంగీతం, రామ్ చరణ్ మాస్ అండ్ క్లాస్ అప్పీల్ ఇలా అన్ని అంశాలు "గేమ్ ఛేంజర్" ను బాక్సాఫీస్ హిట్ గా నిలిపే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   9 Jan 2025 12:10 PM GMT
సంక్రాంతి బిగ్ రికార్డ్.. గేమ్ ఛేంజర్ కొట్టగలదా?
X

సంక్రాంతి పండగ తెలుగు సినిమాలకు అత్యంత కీలకమైన సీజన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీజన్‌లో విడుదలయ్యే సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించడం సర్వ సాధారణం. ఈసారి కూడా సంక్రాంతి బరిలో మూడో పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన "డాకు మహారాజ్" అలాగే విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలు సంక్రాంతి రేసులో నిలిచాయి.

ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. "గేమ్ ఛేంజర్" నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లతో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్‌ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. మరోవైపు, బాలయ్య సినిమా కూడా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. వెంకటేశ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేలా రూపొందించారని సమాచారం.

అయితే, ఈ మూడు సినిమాల్లో ఎక్కువగా "గేమ్ ఛేంజర్" నుంచే భారీ వసూళ్ల ఆశలు పెట్టుకోవచ్చు. గతేడాది విడుదలైన "హను మాన్" చిత్రం సంక్రాంతి సీజన్‌లో చరిత్ర సృష్టించింది. తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ, ప్రేక్షకుల్లో పెద్ద ప్రభావం చూపింది. ఇప్పటివరకు సంక్రాంతి బరిలో హను మాన్ సాధించిన రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.

ఈ ఏడాది "గేమ్ ఛేంజర్" మాత్రమే ఆ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా కంటెంట్‌, శంకర్ మేకింగ్ స్టైల్, థమన్ సంగీతం, రామ్ చరణ్ మాస్ అండ్ క్లాస్ అప్పీల్ ఇలా అన్ని అంశాలు "గేమ్ ఛేంజర్" ను బాక్సాఫీస్ హిట్ గా నిలిపే అవకాశం ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయని టాక్.

అయితే, టికెట్ రేట్ల పెంపు, నైట్ షోల అప్రూవల్ వంటి అంశాలు "గేమ్ ఛేంజర్" విజయం మీద ప్రభావం చూపుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీ నేపథ్యంలో "గేమ్ ఛేంజర్" ఏ మేరకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. ఇక హను మాన్ రికార్డు బ్రేక్ చేస్తుందా? లేదా అనేది మరికొద్ది రోజుల్లో సమాధానం దొరుకుతుంది.