గేమ్ ఛేంజర్ లెక్కలపై క్లారిటీ ఇవ్వగలరా?
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పట్ల విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 11 Jan 2025 11:00 AM GMTరామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా శుక్రవారం గ్రాండ్ గా 6 వేలకు పైగా థియేటర్స్ లో విడుదలైంది. సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్. తప్పకుండా సినిమా ఫస్ట్ డే సాలీడ్ ఓపెనింగ్స్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే సినిమా ఉహించని విధంవా మిశ్రమ స్పందన అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పట్ల విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో అభిమానులు సినిమాను ఆస్వాదించినప్పటికీ, ఇతర ప్రాంతాల్లో మాత్రం సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే, కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో గేమ్ ఛేంజర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 186 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ప్రకటించారు. అయితే, ఈ డేటా నిజంగా వాస్తవమా, అటు ట్రేడ్ వర్గాలు, ఇటు సామాజిక మాధ్యమాల్లో ఆరాచకంగా మారింది.
ట్రేడ్ వర్గాలు మాత్రం లెక్క అసలు లెక్క 85 కోట్లే అనేలా ప్రచారం చేస్తున్నాయి. దాదాపు 100 కోట్ల తేడా వస్తోందని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిమానులు మాత్రం ఈ రికార్డు పై కన్ఫ్యూజన్ తో ఉన్నారని అనిపిస్తుంది. పోస్టర్ ఇచ్చిన డేటా చాలా విస్మయపరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రేడ్ అనలిస్టులు అలాగే సినీ విమర్శకుల ప్రకారం, గేమ్ ఛేంజర్ కొన్ని కీలక మార్కెట్లలో అంచనాలను అందుకోలేకపోయింది.
కానీ, మేకర్స్ విడుదల చేసిన కలెక్షన్ల పోస్టర్‌లో చూపించిన డేటా వాస్తవానికి దూరంగా ఉందనే భావన ఉంది. ఈ పరిస్థితుల్లో, నిర్మాత దిల్ రాజు ఈ విషయంపై స్పందించి స్పష్టతనిస్తారా అనే ఆసక్తి పెరుగుతోంది. దిల్ రాజు తన సినిమాలు విడుదలైన వెంటనే ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది సర్వసాధారణం. రెండవ రోజున సినిమా పట్ల ప్రేక్షకుల స్పందన, బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి మీడియాతో మాట్లాడటం ఆయనకు ప్రత్యేకమైన పద్ధతిగా మారింది.
అయితే, ఈసారి గేమ్ ఛేంజర్ పట్ల వస్తున్న విమర్శల నేపథ్యంలో, ఆయన ఏదైనా ప్రెస్ మీట్ నిర్వహిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. గతంలో పలుమార్లు నిర్మాతలు, అందులో దిల్ రాజు కూడా, కలెక్షన్ల విషయాన్ని హైప్ క్రియేట్ చేయడానికి కాస్త పెంచుతారు అనే విషయాన్ని ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు గేమ్ ఛేంజర్ వసూళ్లపై వచ్చే విమర్శల మధ్య దిల్ రాజు ఈ అంశంపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటి వరకు ప్రెస్ మీట్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో, ప్రేక్షకులు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ కలెక్షన్లపై దిల్ రాజు ఏ మేరకు వివరణ ఇస్తారో వేచి చూడాలి.